ఎంపీల్యాడ్స్‌ను పునరుద్ధరించండి

దేశ వ్యాప్తంగా కరోనావైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎంపీల వేతనాల్లో కోతకు సంబంధించిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. గత సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. మంగళవారం దీనికి సభ ఆమోదం లభించింది. ఇవాళ పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి రాజ్యసభలో ప్రవేశపెట్టారు...

Published : 19 Sep 2020 00:18 IST

దిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనావైరస్‌ వ్యాప్తి చెందుతున్న విపత్కర పరిస్థితుల్లో ఎంపీల వేతనాల్లో కోతకు సంబంధించిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. గత సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. మంగళవారం దీనికి సభ ఆమోదం లభించింది. పాత కొత్త బిల్లులను శుక్రవారం పార్లమెంట్‌ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిలు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. తాజా బిల్లులతో ఏడాది పాటు కేంద్ర మంత్రులు, ఎంపీల జీతాల్లో 30 శాతం కోతపడనుంది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి సహా పలువురు గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు స్వచ్ఛందంగా వేతనాల కోతకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. రెండేళ్ల పాటు ఎంపీల్యాడ్స్‌ కూడా రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇవాళ పలువురు పార్లమెంట్‌ సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎంపీలు స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవసరమైన ఈ నిధులను నిలిపి వేయడం తగదని, వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.

రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులామ్‌ నబీ ఆజాద్‌ వేతనాల కోతకు సంబంధించిన బిల్లులను వ్యతిరేకించారు. ఎంపీల్లో చాలా మంది జీతం మీదే ఆధారపడి ఉన్నారని, వాళ్ల జీతాల్లో 30 శాతం కోత విధించడం సమంజసం కాదని సభకు తెలిపారు. మరోవైపు ఎంపీల్యాడ్స్‌ను రద్దు చేయడంపైనా ఆయన విమర్శలు చేశారు. ఇవి ప్రజలకు సంబంధించిన నిధులని, మరీ అవసరమనుకుంటే రెండేళ్ల రద్దు వ్యవధిని తగ్గించాలని కోరారు. ఎంపీల జీతాల్లో కోత విధించే బదులు, ఆ మొత్తాన్ని సభకు అంతరాయం కలిగిస్తున్న సభ్యుల నుంచి వసూలు చేస్తే బాగుంటుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సభకు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని