బిహార్‌లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

హోరాహోరీగా సాగిన బిహార్‌ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 38 జిల్లాల్లో 55 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధిక నియోజకవర్గాలున్న తూర్పు చంపారన్‌, గయ, శివాన్‌, బేగుసరయి జిల్లాల్లో 4 చొప్పున లెక్కింపు కేంద్రాలను........

Updated : 10 Nov 2020 08:50 IST

పట్నా: హోరాహోరీగా సాగిన బిహార్‌ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 38 జిల్లాల్లో 55 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధిక నియోజకవర్గాలున్న తూర్పు చంపారన్‌, గయ, శివాన్‌, బేగుసరయి జిల్లాల్లో 4 చొప్పున లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో ఓట్ల లెక్కింపు సందర్భంగా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. బిహార్‌లో అక్టోబరు 28, ఈనెల 3, 7 తేదీల్లో మూడు దశల్లో పోలింగ్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవ్వగా.. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంలను తెరుస్తారు. 

ఎగ్జిట్‌ పోల్స్‌ ఏమన్నాయి..
చాలా మేర ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌, ఆర్జేడీతో కూడిన ప్రతిపక్షకూటమి వైపే మొగ్గుచూపడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం 243 శాసనసభ స్థానాలున్న బిహార్‌లో అధికారంలోకి రావాలంటే 122 సీట్లలో గెలుపొందాల్సి ఉంటుంది. 

మధ్యప్రదేశ్‌లోనూ మొదలైన కౌంటింగ్‌..

అటు మధ్యప్రదేశ్‌లోనూ 28 శాసనసభ స్థానాల జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపూ ప్రారంభమైంది. ఏడు నెలల క్రితం.. కమల్‌నాథ్‌ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చి.. భాజపా గూటికి సింధియా వర్గం చేరిన విషయం తెలిసిందే. దాని ఫలితంగా ఖాళీ అయిన 25 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల మృతితో మరో 3 నియోజకవర్గాలు ఈ జాబితాలో చేరాయి. 230 సీట్లున్న మధ్యప్రదేశ్‌ శాసనసభలో ప్రస్తుతం భాజపాకు 107, కాంగ్రెస్‌కు 87మంది ఎమ్మెల్యేలున్నారు. సాధారణ ఆధిక్యాన్ని చేరుకోవాలంటే ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని భాజపాకు మరో 8 సీట్లు దక్కితే చాలు. 28 స్థానాల్లో ఎక్కువచోట్ల కాంగ్రెస్‌ నెగ్గితే అసెంబ్లీలో తన బలాన్ని పెంచుకునే అవకాశముంటుంది. వీటిలో 27 చోట్ల ఇదివరకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫలితాలు ఏ వర్గానికి అనుకూలంగా రానున్నాయో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 

* గుజరాత్‌, యూపీ సహా వివిధ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలకు, బిహార్‌లో వాల్మీకినగర్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపూ కొనసాగుతోంది.

రాష్ట్రం                శాసనసభ స్థానాలు
బిహార్‌                   243
మధ్యప్రదేశ్‌                28
గుజరాత్‌                   8
ఉత్తర్‌ప్రదేశ్‌                 7
మరో 8 రాష్ట్రాల్లో కలిపి       15


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని