బిహార్‌ సీఎంగా మళ్లీ నీతీశ్‌

బిహార్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్‌డీఏ కూటమి తరపున ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది.

Updated : 15 Nov 2020 17:06 IST

ఎన్డీయే శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నిక
రేపే ప్రమాణ స్వీకారం
భాజపా పక్ష నేతగా తార్‌ కిషోర్‌ ప్రసాద్‌ 

పట్నా: బిహార్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి తరఫున ముఖ్యమంత్రిగా మరోసారి నీతీశ్‌ కుమార్‌ ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు ఎన్డీయే శాసనసభ పక్ష నేతగా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం జరిగిన ఎన్డీయే కూటమి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో భాజపా పక్ష నేతగా తార్‌ కిషోర్‌ ప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సుశీల్‌ కుమార్‌ మోదీ తెలిపారు. సమావేశం అనంతరం గవర్నర్‌ను కలిసిన నీతీశ్‌.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. సోమవారం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. కూటమి సమావేశంలో భాజపా నుంచి రాజ్‌నాథ్‌ సింగ్, భూపేంద్ర యాదవ్‌, దేవేంద్ర ఫడణవీస్‌ వంటి నేతలు పాల్గొన్నారు. బిహార్‌ ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి సమావేశమవడం ఇదే తొలిసారి.

తాజా ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో ఉన్న భాజపా (74), జనతాదళ్ ‌(యునైటెడ్‌) (43), హిందుస్థానీ అవాం మోర్చా (4), విరాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ (వీఐపీ) (4) మొత్తం కలిపి 125 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే, జేడీయూకి గతంతో పోలిస్తే (2015 ఎన్నికల్లో 71 స్థానాల్లో గెలుపు) ఈ సారి తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నీతీశ్‌ కుమార్‌ ఉంటారని ఎన్డీయే భాగస్వామ్యపక్షాలు ఇదివరకే స్పష్టంచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం సమావేశమైన కూటమి నేతలు.. స్పీకర్‌, మంత్రివర్గ కూర్పుపై కూడా చర్చించినట్లు సమాచారం.

వరుసగా నాలుగోసారి.. మొత్తంగా ఏడోసారి సీఎంగా..
కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా వివిధ హోదాల్లో నీతీశ్‌ కుమార్‌ బిహార్‌ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా ఆయన మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడానికి సిద్ధమయ్యారు.

* 2000 మార్చి 3 నుంచి వారం రోజుల పాటు ఆయన తొలిసారి బిహార్‌ సీఎం పగ్గాలు చేపట్టారు.
* 2005 నవంబర్‌ 24 నుంచి 2010 నవంబర్‌ 24 వరకు రెండోసారి
* 2010 నవంబర్‌ 26 నుంచి 2014 మే 17 వరకు మూడోసారి (అనంతరం జితన్‌ రాం మాంఝీ తొమ్మిది నెలలపాటు సీఎం పదవి చేపట్టారు.)
* 2015 ఫిబ్రవరి 22 నుంచి 2015 నవంబర్‌ 19 వరకు నాలుగోసారి 
* 2015 నవంబర్‌ 20 నుంచి 2017 జులై 26 వరకు ఐదో సారి (మహా కూటమితో)
* 2017 జులై 27 నుంచి 2020 నవంబర్‌ 13 వరకు ఆరోసారి 
* ప్రస్తుతం బిహార్‌ ముఖ్యమంత్రిగా నీతీశ్ కుమార్‌ ఏడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని