సీడబ్ల్యూసీ ప్రక్షాళన.. ఆజాద్‌కు షాక్‌!

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీని ఆ పార్టీ పునర్‌వ్యవస్థీకరించింది. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలిగా ఉన్న సీడబ్ల్యూసీలో సోనియా గాంధీ సహా 22 మంది సభ్యులు ఉండనున్నారు. 26 మంది శాశ్వత సభ్యులు, ..........

Updated : 11 Sep 2020 23:37 IST

దిల్లీ: కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీని ఆ పార్టీ పునర్‌వ్యవస్థీకరించింది. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలిగా ఉన్న సీడబ్ల్యూసీలో సోనియా గాంధీ సహా 22 మంది సభ్యులు, 26 మంది శాశ్వత సభ్యులు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులతో కూడిన జాబితాను శుక్రవారం రాత్రి విడుదల చేసింది. పార్టీ సంస్థాగత ప్రక్షాళన, పూర్తిస్థాయి నాయకత్వం ఎన్నిక తదితర అంశాలతో 23 మంది కాంగ్రెస్‌ సీనియర్లు ఇటీవల రాసిన లేఖ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చేపట్టిన ఈ పునర్‌ వ్యవస్థీకరణలో పలువురు సీనియర్లకు షాక్‌ ఇచ్చారు. గులాం నబీ ఆజాద్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించారు. సీడబ్ల్యూసీలో ఆయన్ను కొనసాగించినప్పటికీ.. హరియాణా రాష్ట్ర ఇన్‌ఛార్జిగా ఆయన స్థానాన్ని వివేక్‌ బన్సల్‌తో భర్తీ చేశారు. 

ఆజాద్‌తో పాటు అంబికా సోనీ, మోతీలాల్‌ ఓరా, మల్లిఖార్జున ఖర్గేలను సైతం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జిగా ఉన్న ఆర్‌సీ కుంతియా స్థానంలో తమిళనాడు ఎంపీ మాణికం ఠాగూర్‌ను పార్టీ నియమించింది. ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జిగా కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ ఉండనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జిగా ప్రియాంకా గాంధీని నియమించారు.  చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ చింతామోహన్‌కు సీడబ్ల్యూసీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం లభించింది.

ఆగస్టు 24న సీడబ్ల్యూసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో సంస్థాగత వ్యవహారాలు పర్యవేక్షించేందుకు ఆరుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో అంబికా సోనీతో పాటు ఏకే ఆంటోనీ, అహ్మద్‌ పటేల్‌, కేసీ వేణుగోపాల్‌, ముకుల్‌ వాస్నిక్‌, రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా ఉన్నారు. సీడబ్ల్యూసీ సభ్యుల జాబితా ఇదీ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని