AAP: అన్ని స్థానాల్లో పోటీచేస్తాం.. యూపీలో గెలిస్తే 300 యూనిట్ల విద్యుత్‌ ఫ్రీ.. 24గంటలూ సరఫరా!

వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాల్లో పోటీ చేయాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే గృహ వినియోగదారులకు ......

Published : 17 Sep 2021 01:42 IST

లఖ్‌నవూ: వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాల్లో పోటీ చేయాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే గృహ వినియోగదారులకు 300 యూనిట్లు విద్యుత్‌ను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు 38లక్షల కుటుంబాల విద్యుత్‌ బకాయి బిల్లులు మాఫీ చేస్తామని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ప్రకటించారు. అలాగే, రాష్ట్రంలో 24గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేస్తామన్నారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఆయన లఖ్‌నవూలో మీడియాతో మాట్లాడారు.  యూపీలో విద్యుత్‌ ఛార్జీలు అధికంగా ఉన్నాయని మండిపడ్డారు. రైతులకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజే ఉచిత విద్యుత్‌ హామీని నెరవేరుస్తామన్నారు. 

అధిక విద్యుత్‌ బిల్లు కారణంగా అలీగఢ్‌లో రామ్‌జీ లాల్‌ అనే రైతు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో విద్యుత్‌ బిల్లులు కట్టడం పేదలకు కష్టంగా మారిందని, బిల్లులు కట్టనివారిని నేరస్థులుగా పరిగణిస్తున్నారన్నారు. ఇప్పుడు విద్యుత్‌ అనేది లగ్జరీ కాదని, ఇది కనీస అవసరమన్నారు. ప్రతి పౌరుడికీ విద్యుత్‌ను అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ చెప్పిందే చేస్తారని ఆ పార్టీ ఎంపీ, యూపీ ఇన్‌ఛార్జి సంజయ్‌ సింగ్‌ తెలిపారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్‌, పంజాబ్‌,గోవాలలో కూడా ఆప్‌ ఇదే తరహా హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని