Sharad Pawar: మళ్లీ శరద్‌ పవార్‌తో అజిత్ భేటీ.. 24 గంటల్లో రెండోసారి..!

ఎన్సీపీని చీల్చి మహారాష్ట్ర భాజపా ప్రభుత్వంతో జట్టుకట్టిన అజిత్‌ పవార్‌.. మరోసారి తన బాబాయి శరద్‌ పవార్‌ను కలిశారు. విపక్షాల భేటీ జరగనున్న వేళ ఈ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.

Published : 17 Jul 2023 15:42 IST

ముంబయి: మరికొద్ది గంటల్లో విపక్షాల కీలక భేటీ (Opposition Meet) జరగనున్న వేళ మహరాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP) అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar)తో అజిత్‌ పవార్‌ (Ajit Pawar) సోమవారం మళ్లీ భేటీ అయ్యారు. అజిత్‌ తన బాబాయిని కలవడం 24 గంటల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ మధ్యాహ్నం అజిత్‌ తన వర్గం నేతలతో కలిసి ముంబయిలోని శరద్‌ పవార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీని ఐక్యంగా ఉంచే విషయంపై వీరు మరోసారి ఆయనతో చర్చించారు. అయితే, తమ విజ్ఞప్తిని విన్న శరద్‌ పవార్‌.. మళ్లీ ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదని ఎన్సీపీ నేత ప్రఫుల్‌ పటేల్‌ వెల్లడించారు.

విపక్షాల భేటీకి శరద్‌ పవార్‌ రాక ఖాయమే.. కానీ!

పార్టీని చీల్చి మహారాష్ట్ర (Maharashtra) భాజపా కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరిన అజిత్‌ పవార్‌ (Ajit Pawar) ఆదివారం కూడా శరద్‌ పవార్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. పార్టీని ఐక్యంగా ఉంచాలని తన బాబాయిని అజిత్‌ కోరారని ఆయన వర్గానికి చెందిన పార్టీ నేత ప్రఫుల్‌ పటేల్‌ వెల్లడించారు. ఆయన చెప్పింది శరద్‌ పవార్‌ (Sharad Pawar) మౌనంగా విన్నారని, ఎటువంటి స్పందనా వ్యక్తం చేయలేదని తెలిపారు. అయితే, అజిత్‌తో భేటీ అయిన కొద్ది గంటల తర్వాత శరద్‌ ఎన్సీపీ యూత్‌ విభాగం కార్యకర్తలతో మాట్లాడుతూ.. విభజన రాజకీయాలకు పాల్పడే భాజపాకు తాను మద్దతివ్వలేనని, ప్రగతిశీల రాజకీయాల వెంటే ఉన్నానని స్పష్టం చేశారు. 

విపక్షాల భేటీ వేళ ఉత్కంఠ..

ఇదిలా ఉండగా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఉమ్మడిగా ఎదుర్కోవడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ సహా ప్రతిపక్ష పార్టీల నేతలు మరికొద్ది గంటల్లో భేటీ కానున్నారు. బెంగళూరు వేదికగా సోమ, మంగళవారాల్లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమయంలో అజిత్‌.. శరద్‌తో వరుసగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్న అజిత్‌తో భేటీ తర్వాత.. విపక్షాల భేటీకి శరద్‌ పవార్‌ దూరమవ్వొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

అయితే ఆయన ప్రతిపక్షాల సమావేశానికి సమావేశమవుతారని, కాకపోతే మంగళవారం రోజున బెంగళూరుకు వెళ్తారని ఈ ఉదయం ఎన్సీపీ స్పష్టం చేసింది. సోమవారం జరిగే విపక్షాల విందులో ఆయన పాల్గొనబోరని తెలిపింది. ఈ నేపథ్యంలో అజిత్‌ మరోసారి శరద్‌ పవార్‌తో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలతో శరద్‌ పవార్‌ బెంగళూరుకు వెళ్తారా? లేదా? అనే సందిగ్ధత నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని