Opposition Meet: విపక్షాల భేటీకి శరద్‌ పవార్‌ రాక ఖాయమే.. కానీ!

ఎన్సీపీ పార్టీని చీల్చి మహారాష్ట్ర భాజపా కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరిన అజిత్‌ పవార్‌ (Ajit Pawar) ఆదివారం శరద్‌ పవార్‌ (Sharad Pawar)ను కలిశారు. దీంతో నేటి నుంచి మొదలయ్యే విపక్షాల భేటీకి శరద్‌ హాజరవుతారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి పార్టీ నేడు స్పష్టతనిచ్చింది.

Published : 17 Jul 2023 10:23 IST

ముంబయి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికార భాజపాను ఉమ్మడిగా ఎదుర్కోవడమే లక్ష్యంగా విపక్ష రాజకీయ పార్టీలు మరోసారి సమావేశానికి (Opposition Meet) సిద్ధమయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరు వేదికగా సోమ, మంగళవారాల్లో ఈ భేటీ జరగనుంది. అయితే ఈ సమావేశానికి నేషనలిస్ట్ కాంగ్రెస్‌ పార్టీ (NCP) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ (Sharad Pawar) దూరం కానున్నట్లు వార్తలు వచ్చాయి. ఎన్సీపీలో ‘చీలిక’ పరిణామాల తర్వాత శరద్‌ పవార్‌తో నిన్న అజిత్‌ పవార్‌ భేటీ అయిన నేపథ్యంలో ఈ ఊహాగానాలు గుప్పుమన్నాయి. దీనిపై పార్టీ నేడు స్పష్టత నిచ్చింది. విపక్షాల భేటీకి తమ అధినేత హాజరవుతారని స్పష్టం చేసింది.

అయితే, శరద్‌ పవార్‌ (Sharad Pawar) మంగళవారం బెంగళూరుకు వెళ్లనున్నట్లు ఎన్సీపీ వెల్లడించింది. తన కుమార్తె సుప్రియా సూలేతో కలిసి ఆయన రేపు విపక్షాల భేటీలో పాల్గొంటారని పార్టీ తెలిపింది. అయితే.. సోమవారం జరిగే సమావేశాలతో పాటు విందుకు కూడా ఆయన రావట్లేదని తెలిపింది. ఇందుకు గల కారణాన్ని మాత్రం ఎన్సీపీ వెల్లడించలేదు.

బాబాయిని కలిసిన అబ్బాయి

బెంగళూరులోని తాజ్‌ వెస్ట్‌ఎండ్‌ హోటల్‌లో నేడు, రేపు విపక్ష నేతలు (Opposition Meet) సమావేశం కానున్నారు. ఈ సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ప్రసంగంతో ఈ సమావేశం ప్రారంభం కానుంది. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్‌గాంధీ (Rahul Gandhi) సహా 24-26 విపక్ష పార్టీల నేతలు ఈ భేటీకి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. సమావేశాల అనంతరం ప్రతిపక్ష నేతలకు కాంగ్రెస్‌ విందు ఏర్పాటు చేసింది.

అజెండా ఇదే..

మంగళవారం జరిగే ప్రధాన సమావేశానికి అజెండాను నేటి సాయంత్రం జరిగే చర్చల్లో ఖరారు చేయనున్నారు. కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ) రూపకల్పనపై దీనిలో సమాలోచనలు చేయనున్నారు. సీఎంపీ రూపకల్పనకు ఒక ఉప సంఘాన్ని నియమించడం, కూటమికి సంబంధించిన అంశాలపై సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థను రూపొందించడం వంటివాటిపై చర్చించనున్నారు. దీంతో పాటు రాష్ట్రాల వారీగా సీట్ల సర్దుబాటు ప్రక్రియపైనా చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం. విపక్షాల కూటమికి పేరును కూడా ఇదే సమావేశంలో నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది.

భాజపాకు మద్దతివ్వలేను: శరద్‌ పవార్‌

పార్టీని చీల్చి మహారాష్ట్ర భాజపా కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరిన అజిత్‌ పవార్‌ (Ajit Pawar) ఆదివారం శరద్‌ పవార్‌ (Sharad Pawar)ను కలిశారు. పార్టీని ఐక్యంగా ఉంచాలని తన బాబాయిని అజిత్‌ కోరారని పార్టీ నేత ప్రఫుల్‌ పటేల్‌ వెల్లడించారు. ఆయన చెప్పింది శరద్‌ పవార్‌ మౌనంగా విన్నారని, ఎటువంటి స్పందనా వ్యక్తం చేయలేదని తెలిపారు. అయితే, అజిత్‌తో భేటీ అయిన కొద్ది గంటలకు ఎన్సీపీ యూత్‌ వింగ్‌ కార్యకర్తలతో శరద్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘భాజపా విభజన రాజకీయాలను నేను మద్దతివ్వలేను. ప్రగతిశీల రాజకీయాలకు మద్దతివ్వడమే ఎన్సీపీ సిద్ధాంతం. సమ్మిళిత, సమాన, లౌకిక, ప్రజాస్వామ్య విలువలకు మనమంతా కట్టుబడి ఉండాలి’’ అని పార్టీ కార్యకర్తలను ఆయన కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని