Ajit Pawar: పార్టీ పేరు, గుర్తు కోసం పోరాడతా: అజిత్ పవార్‌

ప్రధాని నరేంద్ర మోదీ విధానాలు నచ్చడం వల్లే భాజపా-శివసేన కూటమితో చేతులు కలిపినట్లు ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ తెలిపారు. పార్టీ పేరు, గుర్తు కోసం పోరాటం చేస్తానన్నారు.

Published : 02 Jul 2023 22:58 IST

ముంబయి: ఎన్సీపీ కీలక నేత అజిత్‌ పవార్‌ (Ajit Pawar) మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు మరో 8 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇంతకీ పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ భాజపా-శివసేన కూటమితో ఎందుకు జట్టుకట్టాల్సి వచ్చిందో అజిత్‌ పవార్‌ వివరించారు. గత 9 ఏళ్లుగా ప్రధాని మోదీ దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నందున ఆయనకు తమ మద్దతు పలికేందుకే తనతో పాటు కొందరు నేతలు ‘భాజపా-శివసేన’ కూటమితో కలిశారని చెప్పారు.

‘‘ప్రధాని మోదీ ఈ దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇతర దేశాల్లోనూ ఆయన పాపులర్‌ అయ్యారు. ఆయన నాయకత్వాన్ని ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారు. రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాతో కలిసి పోరాడతాం. అందులో భాగంగానే ఈ కీలక నిర్ణయం తీసుకున్నాం’’ అని అజిత్‌ పవార్‌ మీడియాకు తెలిపారు. ఇవాళ కొందరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారని, త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణ తర్వాత మరికొంత మంది మంత్రులుగా బాధ్యతలు చేపడతారని ఆయన తెలిపారు. మహారాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎన్సీపీలోని చాలా మంది ఎమ్మెల్యేలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని అన్నారు.

ఎన్సీపీపై తన నియంత్రణ గురించి మాట్లాడుతూ ‘అసలైన ఎన్సీపీ’ ఎమ్మెల్యేలుగానే భాజపా- శివసేన కూటమిలో చేరినట్లు చెప్పారు. పార్టీ పేరు, గుర్తుకోసం పోరాటం సాగిస్తామని తెలిపారు. అంతేకాకుండా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని అజిత్‌ పవార్‌ విమర్శించారు. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై పార్టీలోనూ చాలా మంది వ్యతిరేకభావంతో ఉన్నారని ఆయన అన్నారు. ఇటీవల పట్నాలో నిర్వహించిన ప్రతిపక్షాల సమావేశంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో కలిసి శరద్‌ పవార్‌ వేదికను పంచుకోవడంపైనా విమర్శలు వచ్చాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని