Rahul Gandhi: ఆమేఠీ నుంచి మళ్లీ పోటీ చేస్తారా? రాహుల్ సమాధానం ఇదే..!

దేశంలో పెరుగుతోన్న విద్వేషాలు, ధరల పెరుగుదల, నిరుద్యోగానికి వ్యతిరేకంగా నిలబడాలనే లక్ష్యంతోనే భారత్‌ జోడో యాత్ర(Bharat Jodo Yatra) మొదలుపెట్టినట్టు కాంగ్రెస్‌(Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) అన్నారు.

Published : 29 Nov 2022 01:39 IST

దిల్లీ: దేశంలో పెరుగుతోన్న విద్వేషాలు, ధరల పెరుగుదల, నిరుద్యోగానికి వ్యతిరేకంగా నిలబడాలనే లక్ష్యంతోనే భారత్‌ జోడో యాత్ర(Bharat Jodo Yatra) మొదలుపెట్టినట్టు కాంగ్రెస్‌(Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) తెలిపారు. తన యాత్ర లక్ష్యం రాజకీయాలు కాదు.. దేశ ప్రజలందరినీ ఏకతాటిపైకి తేవడమేనన్నారు. భారత్‌ జోడో యాత్ర దేశ ప్రజల వాణిని వినిపిస్తోందని చెప్పారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో ఈ యాత్ర కొనసాగుతున్న వేళ సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్‌లో సంపదంతా కేవలం ముగ్గురు నలుగురు పారిశ్రామికవేత్తల వద్ద పోగుపడిపోవడమే నిరుద్యోగం విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణమన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన ఆమేఠీ నుంచి పరాజయం పాలైన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అకాశం వస్తే మళ్లీ అక్కడి నుంచి బరిలో నిలుస్తారా? అని విలేకర్లు అడగ్గా.. ఏడాది, ఏడాదిన్నర తర్వాత ఆ విషయంపై నిర్ణయం తీసుకుంటానని సమాధానమిచ్చారు. ఈ విషయంలో మీడియాకు హెడ్‌లైన్‌ ఇవ్వదలచుకోలేదని.. ప్రస్తుతం తన ఫోకస్‌ అంతా కేవలం భారత్‌ జోడో యాత్రపైనే ఉందని రాహుల్‌ పేర్కొన్నారు. 

ఆ నేతలిద్దరూ కాంగ్రెస్‌ ఆస్తులు

రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సీఎం అశోక్‌ గహ్లోత్‌, మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ల మధ్య నెలకొన్న వివాదంపైనా రాహుల్‌ స్పందించారు. ఆ నేతలిద్దరూ కాంగ్రెస్‌కు ఆస్తులన్నారు. అయితే, ఆ నేతల మధ్య భేదాభిప్రాయాలు త్వరలో తాను ఆ రాష్ట్రంలో తాను కొనసాగించనున్న భారత్‌ జోడో యాత్రపై ఎలాంటి ప్రభావం చూపబోదని విశ్వాసం వ్యక్తంచేశారు. తాను కాంగ్రెస్‌ గురించి గానీ, రాజకీయాల గురించి గానీ ఆలోచించడంలేదని.. విధ్వంసానికి గురవుతున్న దేశం గురించే ఆలోచిస్తున్నట్టు పేర్కొన్నారు.  

నా ఇమేజ్‌ నాశనం చేసేందుకు వేల కోట్లు ఖర్చుచేస్తున్నారు

అధికార పార్టీ నేతలు తనపై చేస్తోన్న వ్యక్తిగత విమర్శలపై స్పందించిన రాహుల్.. తన యాత్రతో భాజపా గందరగోళంలో పడిందన్నారు. తన ఇమేజ్‌ని నాశనం చేసేందుకు భాజపా నేతలు రూ.వేల కోట్లను ఖర్చు చేస్తున్నారనీ.. వాస్తవానికి అది తనకే అనుకూలంగా మారుతోందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో స్థానం సంపాదించినప్పుడే వ్యక్తిగత దాడులు వస్తాయని.. తాను సరైన దిశలోనే ఉన్నానని అర్థమవుతోందన్నారు. తాను ఎలా ముందుకెళ్లాలో ఈ దాడులే నేర్పుతాయని రాహుల్ వ్యాఖ్యానించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని