BJP: వాగ్దానాలు విస్మరించి రైతులను సీఎం జగన్‌ అవమానించారు: పురందేశ్వరి

ముఖ్యమంత్రి జగన్‌ నిజంగా రైతుల పక్షపాతి అయితే వారంతా ఎందుకింత నైరాశ్యంలో ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నించారు.

Updated : 13 Feb 2024 17:29 IST

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ నిజంగా రైతుల పక్షపాతి అయితే వారంతా ఎందుకింత నైరాశ్యంలో ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నించారు. తమ ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా ప్రచారం చేసుకుంటోన్న సీఎం రైతులకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి అవమానించిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. ప్రతి ఒక్కరి నెత్తిన రూ.2.5లక్షల అప్పు ఉంచారన్నారు. విజయవాడలో భారతీయ జనతా పార్టీ కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గర్జన సభలో ఆమె ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

బటన్‌ నొక్కి.. నిధులు లాగేసుకుంటున్నారు

‘విత్తనం నుంచి మార్కెటింగ్‌ వరకు రైతులను ముందుండి నడిపిస్తామని జగన్‌ అధికారంలోకి రాకముందు చేసిన ప్రసంగాలకు వాస్తవాలకు మధ్య తీవ్రమైన వ్యత్యాసం ఉంది. ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో నిలవడం అత్యంత ఆవేదన కలిగిస్తోంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టపోయిన వ్యవసాయదారులను ఆదుకోలేదు. ధరల స్థిరీకరణ, విపత్తుల నిధులు ఏమయ్యాయి?నీటిపారుదల ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. అన్నమయ్య ప్రాజెక్టు నిర్వాసితులకు నేటికీ న్యాయం చేయలేకపోయారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం కింద విడుదల చేస్తోన్న నిధులతో కనీసం సాగునీటి కాలువ మరమ్మతులు కూడా చేయించలేని దయనీయ పరిస్థితిలో పాలన సాగిస్తున్నారు. తనకున్న అలవాటు ప్రకారం బటన్‌ నొక్కి చివరికి రైతులకు కేంద్రం ఇస్తోన్న నిధులను కూడా లాగేసుకుంటున్నారు’’అని మండిపడ్డారు.

రాష్ట్రంలో జగన్‌ మోహన్‌రెడ్డి రైతులను కూడా అరెస్టు చేస్తూ దుర్మార్గ పాలన సాగిస్తున్నారని భాజపా జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌ ధ్వజమెత్తారు. వ్యవసాయ రుణాలు సక్రమంగా ఇవ్వడంలేదని, యాంత్రీకరణ అటకెక్కించారని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ముందస్తు జాగ్రత్తలను సూచించే వాతావరణం కూడా రాష్ట్రంలో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏడు సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో తీసుకొని వాటి పూర్తికి సహకరిస్తామని ముందుకొచ్చినా సమగ్ర ప్రాజెక్టు నివేదిక పంపించే తీరిక కూడా జగన్‌ సర్కార్‌కు లేదని విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేస్తున్నట్లు తన సొంత పత్రికల్లో ప్రకటనలు వేసుకోవడం సిగ్గుచేటన్నారు. పోలవరం ప్రాజెక్టు కింద అంచనాలు పెంచి నిధుల కోసం కేంద్రానికి వినతులు ఇస్తున్నారని, కేంద్రం నుంచి రూ. 55 వేల కోట్ల నిధులు మంజూరైతే, అందులో పది వేల కోట్ల రూపాయలను కాజేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జే టాక్స్‌ పేరిట అందరిపై అదనపు భారం మోపుతున్నారని మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని