Maharashtra: అజిత్ పవార్‌కు భాజపా సుపారీ.. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి సంచలన ఆరోపణలు

ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ రాజకీయ జీవితాన్ని అంతం చేసేందుకు అజిత్‌ పవార్‌కు భాజపా సుపారీ ఇచ్చిందని మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్ ఆరోపించారు. 

Published : 01 Dec 2023 18:30 IST

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra) ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌పై, రాష్ట్ర మాజీ హోం మంత్రి, ఎన్‌సీపీ సీనియర్ నాయకుడు అనిల్‌ దేశ్‌ముఖ్‌ సంచలన ఆరోపణలు చేశారు. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ (Sharad Pawar) రాజకీయ జీవితాన్ని అంతం చేసేందుకు అజిత్‌ పవార్‌ (Ajit Pawar)కు భాజపా (BJP) సుపారీ ఇచ్చిందని ఆరోపించారు. ఇందులో భాగంగానే భోపాల్‌లో ప్రధాని మోదీ (PM Modi) ప్రసంగం తర్వాత అజిత్‌ పవార్‌, ఎనిమిది మంది ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు భాజపా-శివసేన ప్రభుత్వంలో చేరారని తెలిపారు. 

‘‘ఆయన (అజిత్ పవార్‌ను ఉద్దేశించి) ఎందుకు వేరే మార్గాన్ని ఎంచుకున్నారనేది అందరికీ తెలుసు. నాకు ఎదురైన ఇబ్బందుల్ని ఎదుర్కొనేందుకు ఎన్‌సీపీ సీనియర్‌ నాయకులు సిద్ధంగా లేరు. ఎన్‌సీపీ నాయకులు రూ. 70 వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని భోపాల్‌లో ప్రధాని మోదీ ఆరోపించిన మరుసటి రోజే వారంతా భాజపా-శివసేన ప్రభుత్వంతో చేతులు కలిపారు. శరద్‌ పవార్‌ రాజకీయ జీవితాన్ని అంతం చేసేందుకు అజిత్‌ పవార్‌కు భాజపా సుపారీ ఇచ్చింది’’ అని అనిల్ దేశ్‌ముఖ్ ఆరోపించారు. 

కాంగ్రెస్‌కు అచ్చేదిన్‌.. ఇది కూటమి విజయం: ఎగ్జిట్‌ పోల్స్‌పై సంజయ్‌ రౌత్‌

అజిత్‌ పవార్‌ను ఆయన అనుచరులు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారా? అన్న ప్రశ్నకు.. రాష్ట్రంలో అధికార భాగస్వాములు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తనకు తెలియదని బదులిచ్చారు. కానీ, భాజపా-శివసేన ప్రభుత్వంలో ముఖ్య విషయాల్లో నిర్ణయం తీసుకునే విషయంలో అజిత్‌ పవార్‌ను పక్కన పెట్టారని చెప్పారు. ఈ ఏడాది జులై 2న అజిత్‌ పవార్‌, ఎనిమిది మంది ఎన్‌సీపీ ఎమ్మెల్యేలతో కలిసి భాజపా-శివసేన ప్రభుత్వంతో చేతులు కలిపారు. అనంతరం ఆయన ఉప ముఖ్యమంత్రిగా, పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పరిమాణం మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అప్పటి నుంచి శరద్‌ పవార్‌-అజిత్‌ పవార్‌ మధ్య పలుమార్లు భేటీలు జరిగినప్పటికీ.. ఏకాభిప్రాయం కుదరలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని