Gujarat Election: భాజపా స్టార్‌ క్యాంపెయినర్లు వీరే.. గడ్కరీ, రూపానీలకు చోటు

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్‌క్యాంపెయినర్లుగా 40 మందితో కూడిన జాబితాను భాజపా ప్రకటించింది. ఈ జాబితాలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతోపాటు గుజరాత్ మాజీ సీఎం విజయ్‌ రూపానీలకు కూడా చోటుకల్పించింది.

Published : 12 Nov 2022 01:59 IST

గాంధీనగర్‌: ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తిరుగులేని మెజార్టీతో అధికారాన్ని నిలబెట్టుకోవాలని భాజపా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ  నేపథ్యంలో ఎన్నికల్లో స్టార్‌ క్యాంపెయినర్స్‌ జాబితాను భాజపా విడుదల చేసింది.  ఈ జాబితాలో ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్‌ షాతోపాటు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, గుజరాత్ మాజీ సీఎం విజయ్‌ రూపానీ, మాజీ డిప్యూటీ సీఎం నితిన్‌ పటేల్‌లకు చోటు కల్పించింది. మొత్తం 40 మందితో కూడిన జాాబితాను భాజపా విడుదల చేసింది. వీరిలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అర్జున్‌ ముండా, స్మృతి ఇరానీ, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ సీఎంలు యోగి ఆదిత్యనాథ్‌, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, గుజరాత్ పార్టీ అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌లు ఉన్నారు. 

కొద్దిరోజుల క్రితం భాజపా పార్లమెంటరీ బోర్డు నుంచి నితిన్‌ గడ్కరీని పార్టీ తప్పించింది. తర్వాత ఆయనకు పార్టీపరంగా ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. ఇటీవల హిమాచల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గడ్కరీ పార్లమెంటరీ బోర్డులో స్థానం కోల్పోయినందుకు నిరాశ చెందలేదని, ఆ పదవి నుంచి తనను తొలగించడంపై పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాత్రమే సమాధానం చెప్పగలరని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో గడ్కరీ పేరును చేర్చింది. 

మరోవైపు, గుజరాత్‌ అసెంబ్లీ స్థానాలకు భాజపా అభ్యర్థులను ప్రకటించాడానికి ముందే ఈ ఎన్నికల్లో తాము పోటీ చేయడంలేదని విజయ్‌ రూపానీ, నితిన్ పటేల్, సీనియర్‌ ఎమ్మెల్యే భూపేంద్ర సిన్హ్‌ చుడాసమా ప్రకటించారు. పార్టీలో 75 ఏళ్లు పైబడిన నేతలకు టిక్కెట్లు ఇవ్వకూడదని భాజపా తీసుకున్న నిర్ణయంలో భాగంగానే వీరు పోటీకి దూరంగా ఉండాలని భావించినట్లు సమాచారం. తాజాగా విజయ్‌ రూపానీ, నితిన్‌ పటేల్‌లను స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితాలో చేర్చుతూ పార్టీ నిర్ణయం తీసుకుంది. 

గుజరాత్‌లో 182 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, 160 నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను భాజపా గురువారం ప్రకటించింది. వీరిలో టీం ఇండియా క్రికెటర్‌ రవీంద్ర జడేజా సతీమణి రీవాబా జడేజా, కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరిన పాటిదార్‌ ఉద్యమనేత హార్దిక్‌ పటేల్‌ ఉన్నారు. వీరితోపాటు కాంగ్రెస్‌ పార్టీ తరపున గెలిచి భాజపాలో చేరిన 20 మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు కేటాయించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని