Raghunandan: ఓఆర్‌ఆర్‌ లీజు టెండర్లలో ప్రభుత్వ పెద్దల గోల్‌మాల్‌: ఎమ్మెల్యే రఘునందన్‌

క్రిసిల్‌ సంస్థ రిపోర్టు ప్రకారం ఔటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌) టెండర్లు ఎందుకు పిలవలేదని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు.

Updated : 02 May 2023 18:39 IST

హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) 30 ఏళ్ల లీజు టెండర్లలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గోల్‌మాల్‌కు పాల్పడ్డారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. ఎక్కువ టెండరు వేసిన కంపెనీకి లీజు కట్టబెట్టిన ప్రభుత్వం.. 16 రోజుల పాటు బిడ్‌ను బహిర్గతం చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌ స్నేహితుల కంపెనీలకే ఓఆర్‌ఆర్‌ లీజు దక్కిందని ఆరోపించారు. భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కంపెనీ టెండర్‌ వేసిన మొత్తం కంటే ప్రభుత్వం ఎక్కువ చెప్పిందన్నారు.

‘‘ఐఆర్‌ఎల్‌ కంపెనీ రూ.7,272 కోట్లకు మాత్రమే టెండర్‌ వేసింది. కానీ, టెండరు ద్వారా రూ.7,380 కోట్లు వస్తోందని ప్రభుత్వం చెప్పింది. బిడ్‌ వేసిన మొత్తం కంటే ఐఆర్‌ఎల్‌ ఎందుకు ఎక్కువ ఇస్తోంది. బిడ్‌ ఓపెన్‌ తర్వాత బేరమాడి ఐఆర్‌ఎల్‌కే అప్పగించారా? ఏప్రిల్‌ 11న ఓపెన్‌ చేసిన బిడ్‌ను ఏప్రిల్‌ 27 వరకు వెల్లడించలేదు. టెండర్లను ప్రజల ముందు ఎందుకు బహిర్గతం చేయలేదు. రూ.4కోట్లు చెల్లించి.. క్రిసిల్‌ అనే సంస్థతో ఓఆర్‌ఆర్‌పై అధ్యయనం చేయించారు. క్రిసిల్‌ సంస్థ రిపోర్టు ప్రకారం ఎందుకు టెండర్లు పిలవలేదు. అదానీ కంపెనీ రూ.13వేల కోట్లకు టెండరు వేసేందుకు సిద్ధమైతే.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనుకాడిందో చెప్పాలి’’ అని రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని