Kishan Reddy: పార్టీ కార్యాలయంలోనే దీక్ష కొనసాగిస్తున్న కిషన్‌రెడ్డి.. ఫోన్‌లో అమిత్‌ షా పరామర్శ

కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇందిరాపార్క్‌ వద్ద చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో ఆయన పార్టీ కార్యాలయంలో దీక్షను కొసాగిస్తున్నారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఫోన్‌లో కిషన్‌రెడ్డిని పరామర్శించారు.   

Updated : 13 Sep 2023 23:26 IST

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పార్టీ కార్యాలయంలో తన దీక్షను కొనసాగిస్తున్నారు. ఇందిరాపార్క్‌ వద్ద కిషన్‌రెడ్డి తలపెట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆయనను భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద విడిచిపెట్టారు. దీంతో కార్యాలయంలోనే ఆయన దీక్షను కొనసాగిస్తున్నారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్‌ సర్కార్‌ నిరుద్యోగులను మోసం చేసిందంటూ భాజపా ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద కిషన్‌రెడ్డి ‘24 గంటల నిరాహార దీక్ష’ చేపట్టారు. అయితే బుధవారం సాయంత్రం 6 గంటల వరకే దీక్షకు అనుమతి ఉందని, వెంటనే దీక్షా శిబిరం ఖాళీ చేయాలని పోలీసులు కిషన్‌రెడ్డికి సూచించారు. అయితే గురువారం ఉదయం 6 గంటల వరకు దీక్ష చేస్తానని కిషన్‌రెడ్డి పోలీసులకు తెలిపారు. దీంతో రాత్రి 8 గంటల సమయంలో ఆయన దీక్షను భగ్నం చేశారు. ఈ సందర్భంగా భాజపా కార్యకర్తలకు, పోలీసులకు తోపులాట జరిగింది. 

కిషన్‌రెడ్డిని దీక్షాస్థలి నుంచి పోలీసులు బలవంతంగా తరలిస్తున్న సందర్భంగా ఆయన ఛాతీ దగ్గర గాయం కావడంతోపాటు చేతులు, ఛాతీపై, ఒంటిపై అక్కడక్కడ గోళ్లు గీరుకుపోయాయి. దీంతో పార్టీ కార్యాలయంలో దీక్షను కొనసాగిస్తున్న కిషన్‌రెడ్డిని వైద్యులు పరీక్షించారు. గాయాలైన చోట్ల చికిత్స చేశారు. ఛాతీలో అయిన గాయానికి రేపు ఉదయం ఎక్స్‌రే తీసుకోవాలని సూచించారు. 

ఫోన్‌ చేసి పరామర్శించిన అమిత్‌ షా..

ఈ సంఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కిషన్‌రెడ్డిని ఫోన్‌లో పరామర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగించాలని సూచించారు. పోరాటానికి కేంద్ర భాజపా నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేయడం పట్ల పార్టీ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే భగ్నం చేస్తారా?అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ నిరుద్యోగులకు చేసిన మోసాలను దీక్ష ద్వారా ఎండగడుతుంటే ప్రభుత్వం తట్టుకోలేకపోతోందన్నారు. రజాకార్ల పాలనకు చరమ గీతం పాడే సమయం వచ్చిందన్నారు.

జెడ్ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తితో ఇలాగేనా వ్యవహరించేంది: తరుణ్‌ చుగ్‌

నిరుద్యోగులకు కేసీఆర్ చేసిన మోసాన్ని నిరసిస్తూ నిరాహార దీక్ష చేస్తున్న కిషన్ రెడ్డిని దీక్షాస్థలి నుంచి అక్రమంగా తరలించడాన్ని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ ఛుగ్ ఖండించారు. ఈ దీక్షను ప్రశాంతంగా జరిపేందుకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నప్పటికీ పోలీసులు అక్రమంగా వ్యవహరించారన్నారు. కిషన్ రెడ్డి చేస్తున్న దీక్షకు తెలంగాణ నిరుద్యోగ యువతనుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించడంతోనే జీర్ణించుకోలేకే కేసీఆర్ ఇలా పోలీసులను పురమాయించారని విమర్శించారు. జెడ్ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తితో ఇలాగేనా వ్యవహరించేదన్నారు. పోలీసుల తోపులాటలో కిషన్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయని పేర్కొన్నారు. పోలీసుల వ్యవహారశైలి అక్రమమన్నారు. ఈ ఘటనలో భాజపా కార్యకర్తలు, మహిళా కార్యకర్తలకు కూడా గాయలయ్యాయని తెలిపారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. భాజపా చేపడుతున్న శాంతియుత నిరసన ప్రదర్శనను కూడా కేసీఆర్ తట్టుకోలేక పోతున్నాడని దుయ్యబట్టారు. దీన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో యువత కేసీఆర్‌కు సరైన సమాధానం చెబుతారని పేర్కొన్నారు. 

కిషన్ రెడ్డి తలపెట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేయడాన్ని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఖండించారు. అనుమతి తీసుకొని దీక్ష చేస్తున్నప్పటికీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. మహిళ కార్యకర్తలను ఇష్టారాజ్యాంగ పోలీసులు ఈడ్చుకెళ్ళడం దుర్మార్గమన్నారు. కేంద్ర మంత్రితో పోలీసులు వ్యవహరించిన తీరు ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమన్నారు. .

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు