CM Kcr: సర్వేలన్నీ మనకే అనుకూలం.. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు: సీఎం కేసీఆర్‌

భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగింది. ఎన్నికల ఏడాది దృష్ట్యా పలు అంశాలపై అధినేత కేసీఆర్‌ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

Updated : 10 Mar 2023 20:16 IST

హైదరాబాద్‌: భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగింది. ఈ ఏడాది డిసెంబరులోపు అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావాల్సిన నేపథ్యంలో.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారాస విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఎన్నికలకు పార్టీ నేతలంతా సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు.  రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు అమలు చేస్తోందని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మరింత చొరవ చూపాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. త్వరలో వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు.

రానున్న ఎన్నికల్లో పార్టీకి 103 సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయన్న సీఎం.. 99 శాతం మంది సిట్టింగులకు టికెట్లు ఇస్తానని అన్నట్లు తెలిసింది. పథకాల అమలు ప్రక్రియపై ఇంటెలిజెన్స్‌ నిఘా ఉందన్న సీఎం.. ఎవరైనా తప్పు చేస్తే టికెట్లు ఇవ్వబోనని హెచ్చరించారు. ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో కొందరిపై ఆరోపణలు ఉన్నాయని, ఒకరిద్దరి కారణంగా పార్టీకి చెడ్డపేరు తగదని వ్యాఖ్యానించారు. తప్పులు చేయవద్దు, శిక్ష అనుభవించవద్దంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. తాను అసలే మొండివాడినన్న కేసీఆర్‌.. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో భారాస పోటీ చేసి మంచి స్థానాలు సాధిస్తుందని తెలిపారు.

పార్టీలోని అన్ని స్థాయిల నేతలను కలుపుకొని వెళ్లాలని ముఖ్యనేతలకు సూచించారు. కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కూడా సమావేశంలో సీఎం కేసీఆర్‌ వివరించారు. గృహలక్ష్మి పథకం ద్వారా ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు, దళితబంధు, రెండో విడత గొర్రెల పంపిణీ సహా ప్రభుత్వ పథకాలన్నింటినీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు పనిచేయాలని సూచించారు. ఏటా తెరాస ఆవిర్భావం సందర్భంగా పార్టీ ప్లీనరి నిర్వహించే వారు. ఇకపై భారాస ఆవిర్భావం రోజే పార్టీ ప్లీనరి నిర్వహించాలనే ఆలోచనలో సీఎం ఉన్నట్టు సమావేశంలో వెల్లడించారు. పాదయాత్రలు, కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని, నేతలంతా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయన్న సీఎం కేసీఆర్‌.. షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్లు పార్టీ సమావేశంలో పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని