Gudivada: కొడాలి నాని వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానుల నిరసన.. ఉద్రిక్తత

కృష్ణా జిల్లా గుడివాడలో ప్రముఖ నటుడు చిరంజీవి అభిమానులు బుధవారం ఆందోళనకు దిగారు. చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అభిమానులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

Updated : 09 Aug 2023 14:03 IST

గుడివాడ రూరల్‌: కృష్ణా జిల్లా గుడివాడలో అగ్ర కథానాయకుడు చిరంజీవి అభిమానులు బుధవారం ఆందోళనకు దిగారు. చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అభిమానులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ‘జై చిరంజీవ.. కొడాలి నాని డౌన్‌డౌన్‌’ అంటూ నినాదాలు చేశారు. కొడాలి నాని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

అయితే ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో చిరంజీవి అభిమానులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవి, పలువురు అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు వాహనాలకు అడ్డంగా చిరంజీవి అభిమానులు పడుకుని నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులను పోలీసులు నియంత్రించలేకపోయారు. 

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా?

అనంతరం పట్టణంలోని ఏజీకే స్కూల్‌ సెంటర్లో విజయవాడ మెయిన్‌రోడ్డుపై చిరంజీవి అభిమానులు బైఠాయించారు. వంగవీటి మోహనరంగా విగ్రహానికి క్షీరాభిషేకాలు చేశారు. చిరంజీవి, రంగా అభిమానుల ఓట్లతో గెలిచిన కొడాలి నానీకి 2024 ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

ఏం జరిగిందంటే..

ఏపీ ప్రభుత్వ పెద్దలపై అగ్ర కథానాయకుడు చిరంజీవి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేకెత్తించాయి. ఆయన వ్యాఖ్యలపై కొడాలి నాని మంగళవారం మచిలీపట్నంలో స్పందించారు. ‘సినిమా పరిశ్రమలోని పకోడిగాళ్లు ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారంటూ’ ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఎలా ఉండాలనే సలహాలు ఇస్తున్నవారు.. నటులు పరిశ్రమకే సేవలందిస్తూ సినిమాలు, ఫైట్స్‌, డ్యాన్స్‌లు చేసుకోవాలంటూ వారికి కూడా సలహా ఇస్తే మేలని అన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో చిరంజీవి అభిమానులు గుడివాడలో ఆందోళనకు దిగారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని