Karnataka Elections: కాంగ్రెస్‌ వ్యూహాన్ని ఛేదించలేకపోయాం..పూర్తి బాధ్యత నాదే: బొమ్మై

భాజపా (BJP) ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై (Basavaraj Bommai) ప్రకటించారు. పరాజయానికి గల కారణాలను విశ్లేషించుకొని 2024 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతామన్నారు.

Published : 13 May 2023 21:33 IST

షిగ్గాన్‌: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka assembly Elections) కాంగ్రెస్‌ (Congress) జయకేతనం ఎగురవేసింది. 136 స్థానాల్లో విజయం సాధించి ఏ పార్టీ మద్దతు లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అయితే, ఎన్నికల్లో భాజపా (BJP) పరాజయం పాలవ్వడంపై ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై (Basavaraj bommai) స్పందించారు. ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. ఓడిపోవడానికి గల కారణాలను విశ్లేషించుకొని, 2024 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతామని, ప్రజా ప్రయోజనాల కోసం ప్రతిపక్ష పార్టీగా బాధ్యతాయుతంగా పోరాటం చేస్తామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పక్కా ప్రణాళికతో వ్యవస్థీకృతంగా వ్యవహరించిందని, వాటిని ఛేదించడంలో భాజపా నేతలు విఫలమయ్యారని బొమ్మై పేర్కొన్నారు.

‘‘ ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను. భాజపా ఓటమి పాలయ్యేందుకు పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను. పార్టీ పరాజయానికి ఇంకెవరూ బాధ్యులు కాదు. ఓటమికి ప్రజా వ్యతిరేకత మాత్రమే కాదు. బోలెడు కారణాలున్నాయి. వాటన్నింటినీ పూర్తి స్థాయిలో విశ్లేషించాల్సి ఉంది.’’ అని ఫలితాలు వెలువడిన అనంతరం బొమ్మై మీడియాకు వెల్లడించారు. నియోజకవర్గాల వారీగా పరిస్థితులపై విశ్లేషిస్తామన్నారు. పార్టీ పరంగా ఎదురైన అడ్డంకులను అధిగమించి ముందుకు సాగుతామని, మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం ఉందని బొమ్మై తెలిపారు. లోపాలను సరిదిద్దుకుంటూ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తామేంటో నిరూపించుకుంటామని అన్నారు. రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా భాజపా పని చేస్తుందని చెప్పారు.

ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా పర్యటనల ప్రభావం కర్ణాటకలో ఏమాత్రం  కనిపించలేదు కదా.. అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘ఓటమికి బోలెడు కారణాలు ఉంటాయి. పూర్తిగా సమస్యను విశ్లేషించిన తర్వాతనే ఎవరైనా మాట్లాడాలి తప్ప నోటికొచ్చింది మాట్లాడటం సరికాదు’’ అని బదులిచ్చారు. మరోవైపు షిగ్గాన్‌ నియోజకవర్గంలో తనను గెలిపించిన ప్రజలకు బొమ్మై కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. తాజా ఎన్నికల్లో బొమ్మైకి 1,00,016 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి పఠాన్‌ యాసిర్‌ అహ్మద్‌ఖాన్‌కు 64,038 ఓట్లు వచ్చాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు