Union Budget 2022 : దేశ ప్రజలను ఆర్థిక మంత్రి వంచించారు : కేసీఆర్‌

కేంద్ర బడ్జెట్‌ చాలా దారుణంగా ఉందని, ‘బడ్జెట్‌ అంతా గోల్‌మాల్‌ గోవిందం’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ కేంద్రబడ్జెట్‌ను

Updated : 01 Feb 2022 21:42 IST

గజదొంగలను దేశం దాటించిన ఘనత భాజపాదే

త్వరలోనే 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం

3 నదుల అనుసంధానం ఓ పెద్ద జోక్‌

మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : కేంద్ర బడ్జెట్‌ చాలా దారుణంగా ఉందని, ‘బడ్జెట్‌ అంతా గోల్‌మాల్‌ గోవిందం’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. దేశాన్ని కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రానికి మెదడు లేదని, గతంలో కాంగ్రెస్‌, ఇప్పుడు భాజపా దేశ వినాశనానికి పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రగతిభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆర్థిక మంత్రి ఆత్మవంచన చేసుకున్నారని విమర్శించారు. దేశ ప్రజలను వంచించారని అన్నారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి బడ్జెట్‌లో రూ.12,800కోట్లే కేటాయించారని దుయ్యబట్టారు. అదే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలోనే రూ.33,600 కోట్లు కేటాయించామన్నారు. ఎస్సీల జనాభాపై కేంద్రం అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. రైతు ఉద్యమంలో 700 మంది రైతులు చనిపోయినా బడ్జెట్‌లో కేటాయింపులు శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు.

గజదొంగలను దేశం దాటించిన ఘనత మీదే

భాజపాను కూకటివేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో కలపాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. భారత్‌కు కురచబుద్ధి ప్రధాని ఉన్నారన్నారు. దేశంలో 15 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నా, వాటిని భర్తీ చేయడానికి ఎలాంటి ముందడుగు వేయడం లేదని విమర్శించారు. గజదొంగలు, బ్యాంకులను ముంచినవాళ్లు విదేశాలకు వెళ్లారని, బ్లాక్‌ మనీ ఉన్నవాళ్లను బయటకు పంపిన ఘనత భాజపాకే చెందుతుందని విమర్శించారు. ‘‘నల్లధనం వెనక్కి తెచ్చి కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తామన్నారు. ఎవరికి ఇచ్చారు? భారత్‌ పురోభివృద్ధి సాధించాలంటే భాజపాను బంగాళాఖాతంలో కలపాలి. దేశ ప్రయోజనాలకోసం అవసరమైతే ఉద్యమిస్తాం. ప్రపంచమంతా కోర్టు బయట వివాదాల పరిష్కారాలను అవలంబిస్తోంది. కోర్టు బయట వివాదాల పరిష్కారాల కోసమే లోకాయుక్త ఏర్పాటు చేశాం. వివాదాల పరిష్కారానికి దేశంలో ఆర్బిట్రేషన్‌ కేంద్రాలు లేవు. హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్‌ కేంద్రానికి నిధులు కేటాయిస్తున్నాం. దానికి సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఒకవైపు ఇక్కడ ఏర్పాట్లు జరుగుతుంటే..  దీనికి పోటీగా గిఫ్ట్‌ సిటీలో శిఖండిలా అటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో ప్రస్తావించారు. ఇది న్యాయమా? ’’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

నదుల అనుసంధానం ఓ పెద్ద జోక్‌

కావేరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తామని బడ్జెట్‌లో పేర్కొన్నామని, ఇది ఎలా సాధ్యమవుతుందని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. నదులు అనుసంధానం చేస్తామనడం ఓ పెద్ద జోక్‌ అని వ్యాఖ్యానించారు. ‘‘ఈ మూడు నదులను అనుసంధానం చేస్తామని ఏ అధికారంతో చెప్పారు. గోదావరి జలాల విషయమై ట్రైబ్యునల్‌లో కేసు ఉంది. గోదావరి జలాల్లో ప్రతి బొట్టుపై తెలుగు రాష్ట్రాలకే అధికారం ఉంది. మాకు హక్కు ఉన్న జలాలను కావేరీలో ఎలా కలుపుతారు. అభిప్రాయాలు తీసుకోకుండా బడ్జెట్‌లో ఎలా ప్రకటిస్తారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా ప్రజలకు సాగునీరు అందిస్తున్నాం. దేశంలో 65 వేల టీఎంసీల నీటి లభ్యత ఉంది. కానీ, 35 వేల టీఎంసీల నీళ్లు మాత్రమే వినియోగంలోకి తెచ్చారు. కేంద్రం విధానాల వల్లే భారత్‌లో నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. కేంద్ర జల విధానాల వల్ల రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయి. జల్‌శక్తి మిషన్‌కు రూ.60వేల కోట్లని గొప్పలు చెబుతున్నారు. 140 కోట్ల దేశ జనాభాకు రూ.60వేల కోట్లా? తెలంగాణలో మిషన్‌ భగీరథకు రూ.40 వేల కోట్లు కేటాయించాం. జల్‌శక్తి మిషన్‌ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు.’’ అని కేసీఆర్‌ తెలిపారు.

త్వరలో 40వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం

తెలంగాణలో త్వరలో 40వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. దేశంలో 15 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని అన్నారు. తెలంగాణలో 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయన్నారు. మల్టీజోనల్‌ విధానం వల్ల 2-3శాతమే స్థానికేతరులకు వస్తాయన్నారు. స్థానికులకు ఉద్యోగాలు దక్కాలనే మల్టీజోన్‌ విధానం తెచ్చామన్నారు. స్థానిక నిరుద్యోగులకు 317 జీవో వల్ల ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ‘‘ దేశాన్ని కాపాడుకునే భాధ్యత ప్రజలు, యువతదే. మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తున్నారు. ఆర్థిక అభివృద్ధిలో దేశంలోనే నెంబర్‌ వన్‌ తెలంగాణ. ఈసారి రూ.30వేల కోట్ల అదనపు రాబడి వస్తోంది. కరోనా అతలాకుతలం చేసినా పురోభివృద్ధి సాధిస్తున్నాం.’’ అని అన్నారు. జర్నలిజం పేరుతో సోషల్‌ మీడియాలో పిచ్చిరాతలు రాస్తే ఊరుకునేది లేదని సీఎం హెచ్చరించారు.

లోన లొటారం.. పైన పటారం

సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారంతో మోదీ అధికారంలోకి వచ్చారని కేసీఆర్‌ ఆరోపించారు. కేంద్రప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న గుజరాత్‌ మోడల్‌.. లోన లొటారం..పైన పటారం. పవిత్ర గంగా నదిలో శవాలు తేలేలా కేంద్రం చేసింది. ‘‘కరోనా సమయంలో ఆరోగ్యరంగానికి బడ్జెట్‌ పెంచలేదు. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు కల్పించలేదు. రూ.లక్షల కోట్లు ముంచిన వాళ్లకు రాయితీలు ఇస్తారు. భాజపా పాలన అంటే నమ్మి ఓట్లేసిన వాళ్లకు ముంచడమే.’’ అని కేసీఆర్‌ అన్నారు.

ఎవరిని ఉద్ధరించారు?

ప్రపంచ ఆకలి బాధపై ఏటా హంగర్‌ ఇండెక్స్‌ వెలువడుతుందని, హంగర్‌ ఇండెక్స్‌లో భారత్‌ 101 స్థానంలో నిలిచిందని కేసీఆర్‌ గుర్తుచేశారు. ‘‘నేపాల్‌, బంగ్లాదేశ్‌ కంటే భారత్‌ అధ్వాన్న స్థితిలో భారత్‌ ఉంది. బడ్జెట్‌లో ఆహార రాయితీలు కూడా తగ్గించారు. బడ్జెట్‌లో పంటల మద్దతు ధరల ప్రస్తావన లేదు. కేంద్ర బడ్జెట్‌తో ఎవరిని ఉద్దరించారు’’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు. కేంద్ర జలవిధానాలను పూర్తిగా మార్చాల్సిన అవసరముందని సీఎం కేసీఆర్‌ అన్నారు. దేశంలో 4.1లక్ష మెగావాట్ల స్థాపిత విద్యుత్‌ అందుబాటులో ఉందని, కానీ, 2 లక్షల మెగావాట్ల విద్యుత్‌ కూడా వినియోగించుకోవడం లేదని అన్నారు. విద్యుత్‌ అందుబాటులో ఉన్నా వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విషయం అబద్ధమని రుజువు చేస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తామని సవాల్‌ విసిరారు. ఎల్‌ఐసీని అమ్ముతామని కేంద్రం నిస్సిగ్గుగా చెబుతోందని, లాభాల్లో ఉన్న ఎల్‌ఐసీని ఎందుకు అమ్ముతున్నారని కేసీఆర్‌ ప్రశ్నించారు.

దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం
దేశానికి  కొత్త రాజ్యాంగం అవసరమని కేసీఆర్‌ ప్రతిపాదించారు. కొత్త రాజ్యాంగం అవసరంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్తారా? అని విలేకరులు ప్రశ్నించగా.. ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని సమాధానమిచ్చారు. సాధారణ ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాల్లో తెరాస విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో పరివర్తన,గుణాత్మక మార్పు రావాల్సి ఉందని, మార్పు కోసం తప్పకుండా తన బాధ్యతను నెరవేరుస్తానని సీఎం అన్నారు. ‘‘ మార్పు ఎలా ఉండబోతోంది అనేది త్వరలో వెల్లడిస్తాం. దేశంలో పరివర్తన కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. దేశంలో మార్పు కోసం సంప్రదింపులు జరుపుతున్నా. దేశ పరివర్తన కోసం ఉజ్వలమైన పాత్ర పోషిస్తా. అయితే, ప్రధాని పదవి కోసం పోటీకాదని గమనించాలి. దేశ పరివర్తన కోసం జరిగే ప్రయత్నమని గుర్తించాలి. దేశ పరిస్థితులపై ముందుకెళ్లే విషయమై మేథోమథనం కొనసాగుతోంది. త్వరలో హైదరాబాద్‌లో విశ్రాంత ఐఏఎస్‌, ఐపీఎస్‌ సదస్సు నిర్వహిస్తాం. మరికొద్ది రోజుల్లో ముంబయి వెళ్లి మహారాష్ట్ర సీఎంను కలుస్తా. నాయకులతో సమాలోచనలో దిశానిర్దేశం ఏంటన్నది తెలుస్తుంది’’ అని సీఎం అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా భావించడం లేదని చెప్పారు. దేశంలో మార్పుకోసం విప్లవం రావాల్సి ఉందన్నారు. ప్రజలు మేల్కొంటే నాయకులను వాళ్లే నడిపిస్తారని కేసీఆర్‌ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని