Mamata Banerjee: ఆయన విపక్షాలను నడిపిస్తే.. మోదీని ఎదుర్కోలేం..!

కాంగ్రెస్(Congress) పార్టీతో  కలిసిపనిచేసేందుకు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సుముఖంగా లేరు. ఈ క్రమంలో ఆ పార్టీ నేత రాహుల్‌నుద్దేశించి కార్యకర్తలతో మాట్లాడారు. 

Published : 20 Mar 2023 11:18 IST

కోల్‌కతా: ఇటీవల దేశంలో కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పేరు విపరీతంగా వినిపిస్తోంది. విదేశీ గడ్డపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను భాజపా తీవ్రంగా ఖండిస్తుండగా.. తాజాగా పశ్చిమ్ బెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) ఆయన్నుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ విపక్షాలను నడిపిస్తే.. ప్రధాని మోదీని ఎవరూ అడ్డుకోలేరని ఆమె వ్యాఖ్యానించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘రాహుల్.. మోదీకి అతిపెద్ద టీఆర్‌పీ. అనేక కీలకాంశాలపై దృష్టి మరల్చేందుకు ఆయన్ను హీరోగా చిత్రీకరిస్తోంది. కాంగ్రెస్ పార్టీ భాజపా ఎదుట మోకరిల్లింది. సీపీఎం, భాజపా, కాంగ్రెస్ పార్టీలు తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మైనార్టీలను రెచ్చగొడుతున్నారు’ అని ముర్షిదాబాద్‌లోని కార్యకర్తలను ఉద్దేశించి ఆదివారం ఆమె మాట్లాడారు. మైనార్టీల్లో తృణమూల్‌కు పట్టున్న ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దీనిని ఉద్దేశించి ఆమె ఈ మాట వ్యాఖ్యలు చేశారు.   

కేంద్రంలో మోదీ నేతృత్వంలోని భాజపాను (BJP) ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్న వేళ.. రెండురోజుల క్రితం తృణమూల్, సమాజ్‌వాదీ పార్టీ కీలక ప్రకటనలు చేశాయి. భాజపాతో పాటు కాంగ్రెస్‌కు కూడా సమదూరం పాటించాలని నిర్ణయించాయి. కాంగ్రెస్‌ మద్దతు లేకుండానే కేంద్రంపై పోరాటం చేస్తామన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని