CPI- CPM: కలిసొస్తే భారాసతో.. లేదంటే సీపీఎం, సీపీఐ ఉమ్మడిగానే పోటీ

 భారాసతో కమ్యూనిస్టులకు చెడిందని, కాంగ్రెస్‌తో కలిసి జతకడతారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిడపడ్డారు. 

Published : 30 Jun 2023 18:08 IST

హైదరాబాద్‌: భారాసతో కమ్యూనిస్టులకు చెడిందని, కాంగ్రెస్‌తో కలిసి జతకడతారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. ఇలాంటి నిరాధారమైన వార్తలను ఖండిస్తున్నట్టు చెప్పారు. మునుగోడే కాదు అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారన్నారు. సీట్ల అంశంపై సీఎం కేసీఆర్‌ తమతో చర్చించలేదని, అలాగని వ్యతిరేకంగా కూడా మాట్లాడలేదని స్పష్టం చేశారు. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సీట్లకు ఎసరు వస్తుందేమోనని మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారని దుయ్యబట్టారు. సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో సీపీఎం, సీపీఐ రాష్ట్ర నేతల సంయుక్త సమావేశం జరిగింది. తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, సీపీఎం నేతలు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు హాజరయ్యారు. 

రాష్ర్టంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, భారాసతో పొత్తు, ఎన్నికల ఎత్తుగడలపై సుదీర్ఘంగా చర్చించారు. సీపీఎం, సీపీఐ కలిసే ఉంటాయని.. కలిసే పోటీ చేస్తాయని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. మునుగోడులో వచ్చిన విపత్తును సీపీఎం, సీపీఐ పార్టీలు అడ్డుకున్నాయన్నారు. మునుగోడులో భాజపా గెలిస్తే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేదన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీఎల్‌ సంతోష్‌ ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఓట్లు, సీట్ల కోసం తాము దిగజారమన్న సాంబశివరావు పొత్తులపై వెంపర్లడడంలేదన్నారు. కేసీఆర్‌ ఎప్పుడూ పిలిస్తే అప్పుడే వెళ్తామని స్పష్టం చేశారు. భారాసతో అటు ఇటైతే సీపీఎం, సీపీఐ కలిసి తమకు బలం ఉన్న చోట పోటీ చేస్తాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని