Deve Gowda: భాజపా-జేడీఎస్‌ దోస్తీ.. దేవెగౌడ కీలక వ్యాఖ్యలు

ఇటీవల ఎన్డీయేకి తమ పార్టీ సన్నిహితం కావడంపై జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ కీలక వ్యాఖ్యలు చేశారు.

Published : 27 Sep 2023 18:19 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపా(BJP)తో తమ పార్టీ దోస్తీ కట్టడాన్ని జేడీఎస్‌(JDS) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ(Deve Gowda) సమర్థించుకున్నారు. తమ పార్టీకి అధికార దాహం లేదన్న దేవెగౌడ. అవకాశవాద రాజకీయాలను చేయబోమన్నారు. ఇటీవల భాజపాతో పొత్తు, ఎన్డీయేలో చేరిక అంశంపై జేడీఎస్‌కు చెందిన కొందరు నేతలు విభేదిస్తున్నారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయన బెంగళూరులో విలేకర్ల వద్ద కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ లౌకిక ప్రమాణాలకు కట్టుబడి ఉందని..  మైనార్టీలను ఎప్పటికీ నిరాశపరచబోమన్నారు. కర్ణాటకలో రాజకీయ పరిస్థితులను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(Amit Shah)కు వివరించినట్టు చెప్పారు. గత పదేళ్లలో తొలిసారి హోంమంత్రి అమిత్‌ షాతో చర్చించానన్నారు. తమ పార్టీని కాపాడుకొనే లక్ష్యంతోనే 2014లోక్‌సభ ఎన్నికల్లో భాజపాతో పొత్తు పెట్టుకున్నట్టు దేవెగౌడ తెలిపారు. 

భయపడొద్దు.. లౌకిక ప్రమాణాలను వదులుకోం..  

‘‘భాజపాతో పొత్తు పెట్టుకోవడం ద్వారా మా లౌకిక ప్రమాణాలను కొంచెం కూడా వదులుకొనే రాజకీయాలు చేయం. కుమారస్వామి భాజపా నేతలను కలవడానికి ముందు నేను హోంమంత్రి అమిత్‌ షాను కలిశాను. ఇందులో దాచడానికి ఏమీ లేదు. కర్ణాటక రాజకీయ పరిస్థితులపై ఆయనతో వివరంగా మాట్లాడాను. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. 50 ఏళ్ల రాజకీయ పోరాటంలో ఈ పార్టీలో ఏ ఒక్క వర్గానికీ అన్యాయం జరగలేదు. కర్ణాటక రాజకీయ పరిస్థితులను అమిత్‌షాకు వివరించిన తర్వాత జేడీఎస్‌ను నడిపిస్తున్న నా తనయుడిని పంపిస్తానని చెప్పా. నిర్ణయం తీసుకునే ముందు కూడా మా పార్టీకి చెందిన మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలతో పాటు మరికొందరు నేతలతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకున్నాం. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి హోంమంత్రితో సమావేశమై చర్చించాను. ప్రధాని నరేంద్ర మోదీ బీజీగా ఉంటారు. ఆయన్ను ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఈ  అంశంలో అందుకే నేటికీ నేను ప్రధానిని కలవలేదు’’ అని వివరించారు. 

మోదీకి పట్నాయక్‌ 8 రేటింగ్‌ ఇస్తే.. భాజపా మాత్రం నవీన్‌కు 0 ఇచ్చింది!

కుమార సర్కార్‌ కూలడానికి బాధ్యత ఎవరిది?

బీజేపీతో పొత్తుపై మా పార్టీ కార్యకర్తల నుంచి ఎలాంటి ప్రతిఘటన లేదు. జేడీ(ఎస్‌) అధికార దాహంతో కూడిన పార్టీ కాదు. గతంలో కుమారస్వామి సారథ్యంలోని ప్రభుత్వం(కాంగ్రెస్‌-జేడీఎస్‌) పతనం కావడానికి బాధ్యత ఎవరిది? దీని వెనుక ఉన్న గేమ్ ప్లాన్ ఏమిటి? ఇది కాంగ్రెస్ నాయకత్వానికి తెలియదా? రాహుల్ గాంధీ వచ్చి దేవెగౌడ భాజపాకు బీటీమ్‌ అంటారు. ఇదీ నాకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన సర్టిఫికెట్‌’’ అన్నారు. భాజపాతో పొత్తు అంశాన్నిసమర్థించుకున్న దేవెగౌడ..  జేడీఎస్‌ అవకాశవాద రాజకీయాలు చేయదన్నారు. దశాబ్దాలుగా తమ బాధను, పోరాటాన్ని కొనసాగిస్తున్న ఈ పార్టీని కాపాడుకోవాలన్నారు. అంతేతప్ప ఇందులో ఎలాంటి స్వార్థం లేదని చెప్పారు. ఈ నిర్ణయం తానే తీసుకున్నట్టు తెలిపారు. 

సంక్షోభంలో ఉన్నాం.. పార్టీని కాపాడుకోవాలి!

జేడీఎస్ ఎమ్మెల్యే కేరెమ్మ నాయక్‌ భాజపాతో పొత్తుపై అసంతృప్తి వ్యక్తం చేయడంపైనా దేవెగౌడ స్పందించారు. ‘ఆమెతో మంగళవారం రాత్రి మాట్లాడాను. ఆమె పార్టీతోనే ఉన్నారు. నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారు.  స్థానికంగా ఉన్న కొన్ని విభేదాల కారణంగానే ఆమె అలా మాట్లాడారు. కేరళ జేడీఎస్‌ యూనిట్‌లో వచ్చిన అసమ్మతి గళాన్ని నేను అంగీకరిస్తున్నా. కేరళ మిత్రులతోనూ చర్చించాను. సంక్షోభంలో ఉన్నాం.. కర్ణాటకలో పార్టీని కాపాడుకోవాలి. పార్టీ అధ్యక్ష పదవిని కేరళ మిత్రులకు వదిలేసేందుకు సైతం నేను సిద్ధమే. నేను అధ్యక్షుడిగా ఉండను. JD(S) ఎవరితో పొత్తు పెట్టుకున్నా..  మైనారిటీలను ఎన్నడూ నిరాశపరచదు’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు