JDS: భాజపా నేతలతో దేవెగౌడ కీలక భేటీ.. ఎన్డీయేలో జేడీఎస్‌ చేరికకు రంగం సిద్ధం?

సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌ను ఓడించడమే లక్ష్యంగా భాజపా, జేడీఎస్‌ ఒక్కటి కాబోతున్నాయి. పొత్తులు, సీట్ల కేటాయింపు అంశంపై చర్చించేందుకు జేడీఎస్‌ అగ్రనేతలు దేవెగౌడ, కుమారస్వామి భాజపా అగ్రనాయకత్వంతో భేటీ అయ్యారు.

Published : 22 Sep 2023 01:52 IST

దిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, జేడీఎస్‌ల మధ్య పొత్తులపై చర్చలు కొనసాగుతున్న వేళ గురువారం ఇరు పార్టీల నేతల మధ్య కీలక భేటీ జరిగింది! జేడీఎస్‌ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన తనయుడు కుమారస్వామి దిల్లీలో భాజపా అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డాలతో సమావేశమైనట్లు సమాచారం. ఈ సందర్భంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్‌, భాజపా మధ్య పొత్తులు, సీట్ల కేటాయింపు అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో దేవెగౌడ, కుమారస్వామి భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఎన్డీయేలో జేడీఎస్‌ చేరికపై రేపు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. 

దిల్లీకి బయల్దేరి వెళ్లే ముందు కుమారస్వామి బెంగళూరులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘ఈ సాయంత్రం సమావేశం ఉంది. ఆ భేటీలో ఫలితం తేలాక దిల్లీలో మీడియా ప్రతినిధులకు రేపు అన్ని వివరాలు వెల్లడిస్తాం’’ అన్నారు. అయితే, ఇప్పటివరకు తాము సీట్ల అంశంపై చర్చించలేదన్న కుమారస్వామి.. భాజపా కూడా సీట్ల గురించి ఏమీ ప్రతిపాదించలేదన్నారు. ఈ భేటీలో రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాల్లో ప్రస్తుత పరిస్థితి, 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ వాతావరణంపై వివరంగా చర్చిస్తామని తెలిపారు. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొన్న జేడీఎస్‌.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడమే తమ లక్ష్యమని ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే భాజపా సీనియర్‌ నేత, మాజీ సీఎం యడియూరప్ప జేడీఎస్‌, భాజపా కలిసే పోటీ చేస్తాయని ప్రకటించారు. దీనిపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య..  జేడీఎస్‌-భాజపా పొత్తు పూర్తిగా అనైతికమవుతుందన్నారు. జేడీఎస్‌ భాజపాకు బీ టీమ్ అని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను గతంలోనే చెప్పానని, ప్రస్తుతం అది నిరూపణ కాబోతోందంటూ వ్యాఖ్యానించారు.  జనతాదళ్‌ ‘సెక్యులర్’గా చెప్పుకొనే జేడీఎస్‌ మతతత్వ పార్టీతో చేతులు కలుపుతోందంటూ గతంలో సిద్ధరామయ్య ఆక్షేపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని