Devineni uma: జగన్‌ కనుసన్నల్లో.. సజ్జల డైరెక్షన్‌లోనే దాడులు: దేవినేని ఉమ

రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తెదేపా నేత ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

Updated : 05 Jun 2023 14:34 IST

నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తెదేపా నేత ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడం సబబా అని ప్రశ్నించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘ఇంకెంతమందిపై దాడి చేస్తారు? మీ కళ్లమంట చల్లారలేదా? ప్రజా సమస్యలపై పోరాడటమే తప్పా? ఇదేం సంస్కృతి? రాష్ట్రం ఎటు పోతుందో? సీఎం జగన్‌ ఆజ్ఞ లేనిదే ఇలాంటి దాడులు జరగవు. ప్రతిపక్ష నేతలతోపాటు తెదేపా కార్యాలయంపై దాడులు చేశారు. దాడుల కుట్రదారులెవరో బయటకు రావాలి. దీనికి మంత్రి కాకాణి, సీఎం బాధ్యత వహించాలి. జగన్‌ కనుసన్నల్లో.. సజ్జల డైరెక్షన్‌లోనే దాడులు జరుగుతున్నాయి. దాడులపై ఎస్పీ, డీఐజీ, డీజీపీ సమాధానం చెప్పాలి’’ అని దేవినేని డిమాండ్‌ చేశారు.

ఏం జరిగిందంటే..

తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డిపై ఆదివారం దుండగులు దాడికి యత్నించారు. నెల్లూరులో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 1.10 గంటల సమయంలో బీవీనగర్‌లో ఉన్న కిలారి వెంకటస్వామినాయుడు అపార్ట్‌మెంట్లోని తన కార్యాలయం నుంచి కిందికి దిగుతున్న ఆయనపై కొందరు యువకులు కర్రలతో దాడి చేసేందుకు యత్నించారు. అప్రమత్తమైన తెదేపా నాయకులు, ఆనం అనుచరులు వారిని ప్రతిఘటించారు. స్థానికుల కేకలతో అక్కడి నుంచి పరారయ్యారు. వారు తీసుకొచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు, కర్రలు అక్కడే వదిలి వెళ్లిపోయారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని