అచ్చెన్నాయుడిని కిడ్నాప్‌ చేశారు: చంద్రబాబు

మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉపనేత కింజరావు అచ్చెన్నాయుడిని పోలీసులు కిడ్నాప్‌ చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం చేస్తున్న మోసాలపై నిరంతరం పోరాడుతున్న అచ్చెన్నాయుడిపై

Updated : 12 Jun 2020 10:53 IST

అమరావతి: మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉపనేత కింజరావు అచ్చెన్నాయుడిని పోలీసులు కిడ్నాప్‌ చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం చేస్తున్న మోసాలపై నిరంతరం పోరాడుతున్న అచ్చెన్నాయుడిపై జగన్‌ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. దాదాపు 100 మంది పోలీసులు అర్ధరాత్రి ఆయన ఇంటిపై దాడి చేసి కిడ్నాప్‌ చేశారని ఆరోపించారు. కనీసం మందులు వేసుకోవడానికి కూడా అనుమతించలేదని, వారి కుటుంబ సభ్యులు ఫోన్‌లో కాంటాక్ట్‌ చేసినా ఫోన్‌ అందుబాటులో లేకుండా చేశారని తెలిపారు. జగన్‌ ఉన్మాదం, పిచ్చి పరాకాష్ఠకు చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘అచ్చెన్నాయుడిని ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు, ఎందుకు తీసుకెళ్లారో తెలియదు. ముందస్తు నోటీసులు ఇవ్వలేదు. ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సీఎం జగన్‌, హోం మంత్రి, డీజీపీ సమాధానం చెప్పాలి. శాసనసభాపక్ష ఉప నేతగా ఉన్న అచ్చెన్నాయుడికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కిడ్నాప్‌ చేయడం చట్టాన్ని ఉల్లంఘించడం కాక మరేమిటి? బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 34శాతం నుంచి 24 శాతానికి తగ్గించారు. బీసీ సబ్‌ప్లాన్‌ నిధులు మళ్లించారు. ముఖ్యమైన నామినేటెడ్‌ పదవుల్లో బీసీలకు మొండిచేయి చూపించారు. సంక్షేమ పథకాల్లో కోత విధించారు. వీటన్నింటినీ శాసనసభ వేదికగా ప్రశ్నిస్తున్నందుకే అచ్చెన్నాయుడిని చట్ట వ్యతిరేకంగా కిడ్నాప్‌ చేశారు. ఈ దుర్మార్గానికి, ఉన్మాద చర్యకు నిరసనగా బడుగు బలహీనవర్గాల ప్రజలు నిరసనలు తెలియజేయాలి. జ్యోతిరావుపూలే,అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించి నిరసన తెలియజేయాలి’’ అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని