Yuvagalam: యువగళం సభకు పోలీసుల ఆటంకం

నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర సందర్భంగా సభలకు పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తూనే ఉన్నారు. శుక్రవారం సౌండ్‌ వాహనాన్ని సీజ్‌ చేశారు.

Updated : 04 Feb 2023 05:55 IST

బంగారుపాళ్యంలో మాట్లాడనీయకపోవడంతో భవనం ఎక్కి ప్రసంగించిన లోకేశ్‌
మూడు వాహనాలు సీజ్‌ చేసిన పోలీసులు
సుమారు గంటసేపు ఉద్రిక్తత

ఈనాడు డిజిటల్‌-చిత్తూరు, న్యూస్‌టుడే-ఐరాల, బంగారుపాళ్యం, పూతలపట్టు, తవణంపల్లె: నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర సందర్భంగా సభలకు పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తూనే ఉన్నారు. శుక్రవారం సౌండ్‌ వాహనాన్ని సీజ్‌ చేశారు. దీంతో లోకేశ్‌ నిచ్చెన ఎక్కి జాతీయజెండా చేతబట్టుకుని ప్రజలు, కార్యకర్తల మధ్య నిలబడ్డారు. అంతకుముందు చిన్న ప్రచారరథాన్నీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గంటపాటు ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు మొగిలి నుంచి లోకేశ్‌ ఎనిమిదో రోజు పాదయాత్ర ప్రారంభించారు. మధ్యాహ్నం పోలీసులు భారీగా మోహరించారు. పాదయాత్రగా వస్తున్న లోకేశ్‌.. తాను నిచ్చెనపైనుంచే మాట్లాడతానని చెప్పినా పోలీసులు అంగీకరించకపోవడంతో తెదేపా కార్యకర్తలు సీఎంకు వ్యతిరేకంగా నినదించారు. సమీపంలో ఉన్న భవనం ఎక్కి సాయంత్రం 5.10 నుంచి 24 నిమిషాలపాటు మాట్లాడారు. ‘యువగళం అంటే నీకెందుకంత భయం జగన్‌? ఖాకీలను అడ్డుపెట్టుకుని పాదయాత్ర, బహిరంగ సభలను అడ్డుకుంటున్నావు. మధ్యలో వాళ్లెందుకు.. నేరుగా నువ్వే రా.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర ఆగదు.. పవన్‌కల్యాణ్‌ వారాహీ ఆగదు. అడ్డొస్తే తొక్కుకుంటూ వెళతాం’ అంటూ సీఎంను లోకేశ్‌ హెచ్చరించారు.

* సాయంత్రం సమయంలో సౌండ్‌ వాహనాన్ని సీజ్‌చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. 6.15 సమయంలో తాళాలు ఇచ్చినా, మళ్లీ వెంటనే అడ్డుకోవడంతో తెలుగుదేశం కార్యకర్తలు బైఠాయించారు. అనంతరం లోకేశ్‌ వచ్చి, నిచ్చెన వేసుకుని జాతీయజెండా పట్టుకుని నిలబడ్డారు. సాయంత్రం 6.45 గంటలకు తిరిగి పాదయాత్ర మొదలుపెట్టారు. వంద కిలోమీటర్లు పూర్తవడంతో తగ్గువారిపల్లెకు సమీపంలో ఉచిత డయాలసిస్‌ కేంద్రం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.


ఎన్‌కౌంటర్‌ చేస్తామని బెదిరింపులు

రొంపిచెర్ల: ‘తెదేపాలో తిరిగితే ఎన్‌కౌంటర్‌ చేస్తానని కల్లూరు సీఐ ఆశీర్వాదం బెదిరిస్తున్నారు సార్‌.. ఇటీవలి బ్యానర్ల గొడవలో జడ్పీటీసీ సభ్యుడు రెడ్డీశ్వర్‌రెడ్డి తన అనుచరులతో మాపై దాడి చేయించారు’ అని రొంపిచెర్ల తెదేపా ముస్లిం నాయకులు లోకేశ్‌ వద్ద వాపోయారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని