బీసీల పొట్టకొడుతున్న జగన్‌

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో బీసీల పొట్టకొడుతున్నారని, వారి బిడ్డల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు.

Updated : 12 Mar 2023 05:38 IST

2 కోట్ల మందిలో 4.5 లక్షల మందికే ఏడాదికి రూ.10 వేలు ఇస్తున్నారు
బీసీ కార్పొరేషన్లు కార్ల స్టిక్కర్లకే పరిమితం
ఉప ప్రణాళిక నిధులూ పక్కదారి
బొత్సకు మంత్రి పదవిస్తే.. తూర్పు కాపులంతా అభివృద్ధి చెందినట్టా?
బీసీ సంఘాల సమావేశంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ 

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో బీసీల పొట్టకొడుతున్నారని, వారి బిడ్డల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రెండు కోట్ల మంది బీసీలు ఉంటే కేవలం 4.57 లక్షల మందికి ఏడాదికి రూ.10 వేలిచ్చి చేతులు దులిపేసుకుంటున్నారని మండిపడ్డారు. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటిని కారు స్టిక్కర్లకు మాత్రమే పరిమితం చేశారని, రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారని విమర్శించారు. కొంతమందికి పదవులిస్తే అందరికీ ఇచ్చినట్టు కాదన్నారు. బొత్సకు మంత్రి పదవిస్తే తూర్పు కాపులంతా అభివృద్ధి చెందినట్లు కాదని వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వంలో బీసీలకు ఎలాంటి సాధికారత లేదన్నారు. బీసీ సమస్యలపై రాష్ట్ర బంద్‌కు పిలుపిస్తే అండగా ఉంటానని, దీక్ష చేయాలన్నా చేస్తానని చెప్పారు. బీసీల సమస్యలపై సమగ్రంగా చర్చించి ముసాయిదా రూపొందిస్తామన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో బీసీ సంఘాల నేతలతో శనివారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు.

జనసేన గెలుపు.. బీసీల గెలుపు

‘పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్లీ నడపడం సామాన్య విషయం కాదు. నా అపాయింట్‌మెంట్‌ కూడా తీసుకోలేని వ్యక్తులు.. నేను ఓడిపోయిన తర్వాత తొడలు కొట్టారు, లేని మీసాలు మెలేశారు’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. జనసేన గెలుపు బీసీల గెలుపన్నారు. ‘బీసీలకు రాజ్యాధికారం రావాలని నేను పంతం పట్టా. బీసీలకు ఆర్థిక పరిపుష్ఠి చేకూరితే రాజకీయ సాధికారత దానంతటదే వస్తుంది. జనసేన అధికారంలోకి వస్తే బీసీ సాధికారతను చేతల్లో చూపిస్తాం. నేను కాపు నాయకుణ్ని కాదు. ప్రజా నాయకుణ్ని. ఒక కులం పరిధిలో ఆలోచించను. మానవత్వం, జాతీయభావంతో పెరిగా’ అని స్పష్టం చేశారు.

కాపులు సొంతం చేసుకుంటే ఓడిపోయేవాణ్ని కాదు 

‘గత ఎన్నికల్లో కాపులు నన్ను సొంతం చేసుకుని ఉంటే నేను ఓడిపోయేవాణ్ని కాదు. గోదావరి జిల్లాల్లో మాకు వచ్చిన ఓట్లలో సగానికిపైగా బీసీలవే. అందులోనూ మత్స్యకార సామాజికవర్గమే బలంగా నా వెంట నిలబడింది. దీన్ని ఎప్పటికీ మర్చిపోను. నాకు ఒక కులాన్ని అంటగట్టి, ఇతర వర్గాల వారితో తిట్టిస్తున్నారు. కాపులను బీసీలతో తిట్టిస్తే క్షేత్రస్థాయిలో ఆ రెండు వర్గాలవారు కొట్టుకోవాలనేది కొంత మంది పన్నాగం. కుట్రలు చేస్తున్న నాయకులు ఏ పార్టీలో ఉన్నా తిట్టుకోరు.. మంచిగా మాట్లాడుకుంటారు. దాన్ని అందరూ గమనించాలి’ అని పవన్‌ చెప్పారు. 

కాపులు, శెట్టిబలిజలను ఏకం చేశా

‘ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నేను సోషల్‌ ఇంజినీరింగ్‌ చేశా. కాపులకు, శెట్టిబలిజలకు పడదని చిన్నప్పటి నుంచి వింటున్నా. ఎందుకు పడదంటే సమాధానం ఉండదు. నాకు ఓట్లు వేస్తారా లేదా అని చూడకుండా వెళ్లి కూర్చుని సయోధ్య కుదిర్చా. ఇప్పుడు ఆ రెండు సామాజికవర్గాల్లో బలమైన మార్పు వచ్చింది’ అని చెప్పారు. ‘ఉత్తరాంధ్రకు చెందిన 26 బీసీ కులాల్ని తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగిస్తే ఏ పార్టీ నాయకుడూ మాట్లాడలేదు. అప్పుడు తెదేపాను అడిగా.. ఇప్పుడు వైకాపానూ ప్రశ్నిస్తున్నా. అధికార పార్టీలో ఆయా సామాజికవర్గాలకు చెందిన మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రశ్నించలేదు. కానీ జనసేనే బలంగా మాట్లాడింది. ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత భారాస నేతలపై కూడా ఉంది’ అని పేర్కొన్నారు.

వైకాపా నేత కాండ్రు కమల హాజరు

సమావేశానికి మంగళగిరికి చెందిన వైకాపా నేత కాండ్రు కమల హాజరయ్యారు. బీసీ సంక్షేమ సంఘం మహిళా నేతగా, పవన్‌ ఆశయాలు తెలుసుకోవడానికే వచ్చానని తెలిపారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు జనసేన మద్దతివ్వాలన్నారు.  ‘బీసీలకు బలమున్న చోట ఇతర సామాజికవర్గాలకు సీట్లు కేటాయిస్తూ నాలాంటి వారికి అన్యాయం చేస్తున్నారు. జనసేన అలా చేయొద్దు. సీట్ల కేటాయింపులో ఆర్థిక బలాన్ని చూడొద్దు’ అని అన్నారు.

బీసీల జనగణనకు మద్దతివ్వాలి

బీసీల జనాభా దామాషా ప్రకారం ఫలాలు అందాలంటే బీసీ జనగణన చేపట్టాలని, దీనికి జనసేన మద్దతివ్వాలని బీసీ సంఘాల నేతలు కోరారు. వైకాపా నేతలు బీసీల్లోని వివిధ సామాజికవర్గాలను ఎస్సీ, ఎస్టీల్లో చేరుస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికీ చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కని కులాలకు వచ్చే ఎన్నికల్లో జనసేన టికెట్లు కేటాయించాలని  విన్నవించారు.

217 జీవోను రద్దు చేయాలి

సంప్రదాయ మత్స్యకారులైన బెస్తల నడ్డివిరిచే 217 జీవోను రద్దుచేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను బెస్త సంఘం రాష్ట్ర కన్వీనర్‌ శ్రీనివాసులు కోరారు. పార్టీ కార్యాలయంలో పవన్‌కల్యాణ్‌కు వినతిపత్రాన్ని అందించారు. ‘జనసేన అధికారంలోకి వస్తే గంగమ్మ తెప్పోత్సవం రాష్ట్ర పండుగగా ప్రకటించాలి’ అని విన్నవించారు.


అధికారంలోకి వస్తే తితిదే సభ్యులుగా సగం మంది బీసీలే

‘36 మంది తితిదే సభ్యులుంటే బీసీలకు వైకాపా ప్రభుత్వం 3 మాత్రమే కేటాయించింది. జనసేన అధికారంలోకి వస్తే ఇందులో సగం పదవులు బీసీలకే ఇస్తాం. వైకాపా ప్రభుత్వం రూ.34 వేల కోట్ల ఉప ప్రణాళిక నిధుల్ని దారి మళ్లించింది. ఒక్క రూపాయి కూడా దారి మళ్లకుండా చివరి రూపాయి కూడా బీసీలకే దక్కేలా కృషి చేస్తా. జీవో 217 తీసుకొచ్చి చెరువుల్ని అర్థబలం ఉన్నవారికి కట్టబెట్టి, మత్స్యకారులను దేహీ అనే పరిస్థితికి తీసుకొచ్చారు. రూ.20 కోట్లు ఖర్చు చేస్తే వారు అడుగుతున్న జెట్టీలను అందుబాటులోకి తేవచ్చు. కానీ ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. 400 బ్యాక్‌లాగ్‌ పోస్టుల్నీ భర్తీ చేయడం లేదు’ అని మండిపడ్డారు.


ఆవిర్భావ సభలో బీసీ డిక్లరేషన్‌
మనోహర్‌

వైకాపా ప్రభుత్వం బీసీలను విడగొట్టి పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తోందని, దీనిపై బీసీలు అప్రమత్తంగా ఉండాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. 14న పార్టీ ఆవిర్భావ సభలో బీసీ డిక్లరేషన్‌ ప్రకటిస్తామన్నారు. వైకాపా ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 10% రిజర్వేషన్లు కోత వేయడంతో 1,680 మందికి పదవులు దక్కకుండా పోయాయని జనసేన నాయకుడు పోతిన మహేష్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని