వైకాపాకు ఎదురుగాలి

పట్టభద్రుల విషయంలో అధికార పార్టీ అంచనాలు పట్టాలు తప్పాయన్న భావన రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. విశాఖే రాజధాని అని ఉత్తరాంధ్రలో వ్యూహాలు పన్నినా ప్రయోజనం కలగలేదు.

Updated : 18 Mar 2023 06:58 IST

ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానాల్లో ఓటమి
పశ్చిమ రాయలసీమలో బొటాబొటీ అధిక్యం
ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో అతికష్టం మీద బయటపడిన వైనం

ఈనాడు, అమరావతి: పట్టభద్రుల విషయంలో అధికార పార్టీ అంచనాలు పట్టాలు తప్పాయన్న భావన రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. విశాఖే రాజధాని అని ఉత్తరాంధ్రలో వ్యూహాలు పన్నినా ప్రయోజనం కలగలేదు. పార్టీకి కంచుకోట లాంటి రాయలసీమలోనూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురుగాలి తప్పలేదు. సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన దాదాపు చివరి ఎన్నికలివి. పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో గెలవడం ద్వారా ఈ రెండు వర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత లేదనే సందేశాన్ని గట్టిగా ఇవ్వాలని వైకాపా పన్నిన వ్యూహం బెడిసికొట్టింది. అంగ, అర్థ, అధికార బలంతో అన్ని రకాలుగా ప్రదర్శన చేసినా పట్టభద్రులు తిప్పికొట్టారు. శుక్రవారం అర్ధరాత్రి వెలువడిన ఫలితాల్లో ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో తెదేపా అభ్యర్థులు విజయం సాధించారు. పశ్చిమ రాయలసీమలో వైకాపా, తెదేపా అభ్యర్థుల నడుమ పోటీ హోరాహోరీగా సాగుతోంది.

వాలంటీర్లతో అంత చేసినా..

వాలంటీర్లతో మంత్రులే స్వయంగా పలుచోట్ల సమావేశాలు నిర్వహించి వారికి ఓటర్ల నమోదు లక్ష్యాలను నిర్ధేశించారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, వైకాపా గృహసారథులు.. ఇలా అందరినీ మోహరించారు. పోలింగ్‌ రోజున తిరుపతి, ఒంగోలు, లింగాల (పులివెందుల నియోజకవర్గంలోని) తదితర ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన వారు ప్రత్యర్థి పార్టీల వారిపై దాడులకు దిగారు. ‘వాలంటీర్లను వినియోగించుకున్నా.. అధికార యంత్రాంగం మద్దతు తీసుకున్నా కనీసం గెలుపు ముంగిట నిలవలేకపోయామంటే.. ఇవన్నీ లేకుండా పోటీ చేసి ఉంటే పరిస్థితి ఇంకెలా ఉండేదో..’ అని అసెంబ్లీ లాబీల్లో శుక్రవారం పలువురు వైకాపా ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించడం గమనార్హం.

విశాఖ వ్యూహం తారుమారు

విశాఖ విషయంలో ఎంతో ప్రాధాన్యమిచ్చారు. విశాఖ పాలనా రాజధాని చేస్తున్నామంటూ మూడేళ్ల కిందటే ప్రకటించారు. పాలన రాజధాని కాదు... విశాఖే రాజధాని అంటూ ఈ మధ్య కొత్త రాగాన్నీ ఆలపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నుంచి రెండు మూడు సందర్భాల్లో ముఖ్యమంత్రే స్వయంగా తానే విశాఖకు తరలివెళ్లనున్నట్లు ప్రకటించారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమిట్‌నూ నిర్వహించారు. వైకాపాలో సీఎం జగన్‌ తర్వాత కీలక నేతగా వ్యవహరించిన ఎంపీ విజయసాయిరెడ్డి సూచించిన వ్యక్తినే అభ్యర్థిగా ఎంపిక చేశారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అక్కడే ఎన్నికల వ్యవహారాలను చక్కబెట్టే ప్రయత్నమూ చేశారు. చివరికి పోలింగ్‌ రోజు కూడా పలు కేంద్రాల్లో సుబ్బారెడ్డి పర్యటించారు. ఇన్ని ప్రయత్నాలు చేసినా, అధికారాన్ని వినియోగించినా ప్రతికూల ఫలితమే రావడం వైకాపాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఎలాగోలా..

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో బోగస్‌, నకిలీ ఓట్లతో ఎలాగోలా అధికార వైకాపా గట్టెక్కింది. ఉపాధ్యాయవర్గం ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్న విషయం తెలిసిందే. అందువల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం ద్వారా ఆ వర్గంలో వ్యతిరేకత లేదని చాటేందుకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విశ్వ ప్రయత్నాలు చేశారు. ఓటర్ల నమోదు నుంచి అధికారుల బదిలీలు, అనుకూలమైన ఉన్నతాధికారి నియామకం వంటి అనేక జిమ్మిక్కులు చేసినా.. బొటాబొటీగా మెజారిటీ లభించింది.

భ్రమలు వీడాయి.. ఇదో వార్నింగ్‌

‘భ్రమలు వీడాయి.. ఇదో పెద్ద వార్నింగ్‌...’అని ఈ ఫలితాలపై వైకాపా ఎమ్మెల్యేలు కొందరు, ఇద్దరు మంత్రులు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో... అసెంబ్లీ లాబీల్లో వీరంతా ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటూ కనిపించారు. ‘రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ప్రతి సంవత్సరం జనవరి 1నే ఖాళీల భరీకి క్యాలెండర్‌ విడుదల చేస్తాం...’ అని ఎన్నికల సందర్భంగా యువతకు వైకాపా ఇచ్చిన హామీ ప్రధానమైనది. దానిని నెరవేర్చకపోవడంపై పట్టభద్రులు తమ అసంతృప్తిని ఇప్పుడిలా ఓట్ల రూపంలో చూపించారన్న భావన వ్యక్తవమతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని