ప్రభుత్వం అప్పులు తెచ్చి దారి మళ్లిస్తోంది

అప్పులు చేస్తున్న సొమ్మును రాష్ట్రం, ప్రజల కోసం కాకుండా సొంతానికి వాడుకుంటున్నందునే .. ప్రజల ఆదాయం తగ్గిపోయి పేదరికం పెరుగుతోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

Updated : 18 Mar 2023 06:46 IST

ఉత్పత్తియేతర రంగాల్లోనూ అప్పులు పెట్టడంతో రూ.55వేల కోట్లుగా ద్రవ్యలోటు
రాష్ట్ర బడ్జెట్‌పై ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు

ఈనాడు-అమరావతి: అప్పులు చేస్తున్న సొమ్మును రాష్ట్రం, ప్రజల కోసం కాకుండా సొంతానికి వాడుకుంటున్నందునే .. ప్రజల ఆదాయం తగ్గిపోయి పేదరికం పెరుగుతోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అప్పులను ఉత్పత్తి సంబంధిత కార్యకలాపాలకు పెట్టాలన్నది ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ కీన్స్‌ సిద్ధాంతమని, రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తియేతర రంగాల్లో పెట్టి బడ్జెట్లో ద్రవ్య లోటు రూ.55 వేల కోట్లుగా చూపిందన్నారు. ఆర్‌బీఐ, కాగ్‌, కేంద్రం లాంటి వ్యవస్థలన్నీ అప్పులతో మునిగిపోతున్నారని చెబుతున్నా.. ప్రభుత్వం అలాంటిదేమీ లేదని బుకాయిస్తోందన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తెదేపా ప్రభుత్వం మొదలైనప్పుడు రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్లు కాగా...రాష్ట్ర విభజన కష్టాలు ఉన్నా మా ప్రభుత్వం దిగిపోయే నాటికి (2018-19) అది రూ.13 వేల కోట్లుగా ఉంది. ప్రస్తుత ప్రభుత్వం రెవెన్యూ లోటు రూ.28 వేల కోట్లుగా చూపుతోంది. ఫిజికల్‌ డెఫిషిట్‌ కూడా విపరీతంగా పెరుగుతోంది. గ్యారంటీస్‌ అప్పులను కూడా 90 శాతం నుంచి 180 శాతానికి పెంచారు. వీటితో రాష్ట్రం ఆర్థికంగా కుప్పకూలింది. అప్పులు, కేంద్ర ప్రభుత్వమిచ్చే డబ్బుపైనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడుతోంది...’ అని యనమల ధ్వజమెత్తారు.

మౌలిక సదుపాయాలెలా సాధ్యం?  

‘ఏటా బడ్జెట్‌లో అంకెలు ఘనంగా చూపించి ఖర్చు చాలా తక్కువ పెట్టడం వల్లే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిని మెరుగుపరచడానికి కూడా తాజా బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. గతంలో మూల నిధి వ్యయం రూ.33 వేల కోట్లకుపైగా పెట్టి రూ.7వేల కోట్లే ఖర్చు చేశారు. లబ్ధిదారులకు నేరుగా నగదు పంపిణీ కార్యక్రమానికి (డీబీటీ) రూ.54 వేల కోట్లు కేటాయించినట్టు సీఎం గొప్పగా చెప్పారు. డీబీటీ అమల్లో 19వ స్థానంలో ఉంది. ఇప్పుడు ప్రకటించిన బడ్జెట్‌ కేటాయింపులు చూస్తే 2022-23తో పోలిస్తే చాలా పథకాలు తీసేశారని అర్థమవుతోంది. సుస్థిర అభివృద్ధి వృద్ద్ధిలోనూ రాష్ట్రం 13వ స్థానంలో ఉంది. సంక్షేమానికే ఎక్కువ నిధులు వెచ్చిస్తే పేదరికం ఎందుకు పెరిగిందో ప్రభుత్వం చెప్పాలి...’ అని యనమల డియాండ్‌ చేశారు.

ఆదాయార్జన రంగాలన్నీ దెబ్బతిన్నాయి

‘పరిశ్రమలు రాకపోవడంతో నిరుద్యోగ సమస్య పెరిగింది. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు దెబ్బ తినడానికి ప్రభుత్వ విధానాలే కారణం. వ్యవసాయ రంగంలో లైవ్‌ స్టాక్‌, ఆక్వాకల్చర్‌, హార్టీ కల్చర్‌ ప్రధాన గ్రోత్‌ ఇంజన్లు. తెదేపా ప్రభుత్వంతో పోలిస్తే లైవ్‌ స్టాక్‌ గ్రోత్‌ -6.5 శాతం. ఆక్వాకల్చర్‌ 14 శాతం కాగా... మొత్తం వ్యవసాయం విభాగం చూస్తే -48శాతం గ్రోత్‌ రేట్‌లో ఉంది. తెదేపా ప్రభుత్వంలో పోలిస్తే మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగం -4.5 శాతంలో ఉంది. కన్‌స్టక్ష్రన్‌ -2.6శాతం ఉంది. మొత్తంగా పారిశ్రామిక రంగం -1.4శాతం, సేవా రంగం -1.7శాతం గ్రోత్‌కే పరిమితమయ్యాయి. నిరుద్యోగంలో 8.5 శాతంతో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. ఆర్థికపరమైన అభివృద్ధి రేటు తగ్గిపోతుంటే... రాష్ట్రంలో అప్పులు పెరుగుతున్నాయి. 2024-25 నాటికి 11లక్షల కోట్ల అప్పులు లెక్క చూపేలా ఉన్నారు. దానికి కట్టే వడ్డీనే దాదాపు రూ.40 వేల కోట్లకు చేరుతోంది...’ అని యనమల వివరించారు.


ప్రశాంతతను భగ్నం చేస్తే ఉత్తరాంధ్ర ప్రజలు క్షమిస్తారా?

‘భూ కబ్జాలు చేయడం, దోపిడీ, రౌడీయిజానికి పాల్పడితే ప్రశాంతమైన ఉత్తరాంధ్ర ప్రజలు ఊరుకుంటారా? మధ్యతరగతి వారు అత్యధికంగా ఉన్న ప్రాంతంలో వైకాపా ప్రభుత్వం ప్రశాంతతను భగ్నం చేసిందన్న ఆవేదన, బాధ ఉత్తరాంధ్ర ప్రజల్లో ఉంది. దాని ప్రభావమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి పరాభవం...’ అని యనమల పేర్కొన్నారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు