రాహుల్‌ కేసుకు అదానీతో సంబంధం ఏమిటి?

పారిశ్రామికవేత్త గౌతం అదానీ అంశానికి, లోక్‌సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై అనర్హత వేటుపడడానికి ఎలాంటి సంబంధం లేదని భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు.

Published : 26 Mar 2023 03:38 IST

కర్ణాటక ఎన్నికల్లో లబ్ధికే తీర్పుపై స్టే కోరని కాంగ్రెస్‌
ఓబీసీలను కించపరచడంపై దేశవ్యాప్త ఉద్యమం: భాజపా

పట్నా: పారిశ్రామికవేత్త గౌతం అదానీ అంశానికి, లోక్‌సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై అనర్హత వేటుపడడానికి ఎలాంటి సంబంధం లేదని భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు. రాహుల్‌ సంధిస్తున్న ప్రశ్నలకు ప్రధాని నరేంద్రమోదీ భయపడుతుండడం వల్లనే ఈ పరిణామం చోటు చేసుకుందన్న వాదనను ఆయన శనివారం విలేకరుల సమావేశంలో తోసిపుచ్చారు. త్వరలో కర్ణాటకలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో ఈ అంశాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకునే ఉద్దేశంతోనే సూరత్‌ కోర్టు తీర్పుపై స్టే కోసం కాంగ్రెస్‌ ప్రయత్నించలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌లో అనేకమంది న్యాయనిపుణులు ఉన్నా ఉద్దేశపూర్వకంగానే స్టే కోరడం లేదన్న విషయాన్ని రాహుల్‌ సోదరి ప్రియాంక గాంధీ మాటలే బలపరుస్తున్నాయని చెప్పారు. అంతర్గత రాజకీయాల్లో భాగంగా కాంగ్రెస్‌ పార్టీలో కొంతమంది నేతలు రాహుల్‌ను వదిలించుకోవాలని చూస్తున్నట్లు ఉందన్నారు. ‘మేం ఇక్కడ ఉన్నది అదానీని బలపరచడానికి కాదు. కేంద్రంలో యూపీయే అధికారంలో ఉన్నప్పుడూ అదానీకి కాంట్రాక్టులు దక్కేవి. రాజస్థాన్‌ వంటి కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లోనూ అదానీ గ్రూపు వ్యాపారాలు చేస్తోంది’ అని రవిశంకర్‌ వివరించారు. ఒక విపక్ష నేతగా విమర్శలు చేసే హక్కు రాహుల్‌కు ఉందనీ, అవి విమర్శనాత్మకంగా కాకుండా ఓబీసీలను కించపరిచేవిగా ఉన్నాయని చెప్పారు. దీనిపై దేశవ్యాప్తంగా భాజపా ఉద్యమించనుందని ప్రకటించారు.  

రాహుల్‌పై మరో దావా: సుశీల్‌ మోదీ

2019లో ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్‌పై పట్నా కోర్టులో దావా వేశానని భాజపా ఎంపీ సుశీల్‌ కుమార్‌ మోదీ తెలిపారు. విచారణ కోసం రాహుల్‌ ఏప్రిల్‌ 12న పట్నా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉందని చెప్పారు.

ఆయన క్షమాపణలు చెప్పాల్సింది: హిమంత

గువాహటి: రాహుల్‌ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిఉంటే, లేదా వాటిని ఉపసంహరించుకుంటే ఆ అంశం అక్కడితో ముగిసిపోయేదని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. పొరపాటున నోరుజారటం సహజమేననీ, గతంలో తాము కూడా క్షమాపణలు చెప్పామని తెలిపారు.

సావర్కర్‌ను అవమానించారు: శిందే

ముంబయి: ఓబీసీలతో పాటు హిందుత్వ సిద్ధాంతకర్త వి.డి.సావర్కర్‌ను అవమానించినందుకూ రాహుల్‌కు శిక్ష పడాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే అన్నారు. మహారాష్ట్ర శాసనసభలో శనివారం ఆయన మాట్లాడారు. ఈ అపరాధానికి మహారాష్ట్ర వీధుల్లో రాహుల్‌ను జనం నడవనివ్వరని చెప్పారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని