Nakka Anand Babu: సజ్జలను విచారించాలి.. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు ఎవరికి ఓట్లు వేశారో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏవిధంగా చెబుతారని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు ప్రశ్నించారు.

Updated : 27 Mar 2023 07:53 IST

గుంటూరు (పట్టాభిపురం), న్యూస్‌టుడే: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు ఎవరికి ఓట్లు వేశారో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏవిధంగా చెబుతారని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. గుంటూరులో మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో ఉమ్మడి గుంటూరు జిల్లా తెదేపా నేతలకు ఆత్మీయ విందు ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆనందబాబు విలేకర్లతో మాట్లాడారు. ‘మా వద్ద ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్లు మాకు ఓటింగ్‌ చేయలేదు.. కొందరు క్రాస్‌ ఓటింగ్‌ చేశారు. మేము ఇచ్చిన కోడింగ్‌ అనుసరించలేదు.. అని సజ్జల చెప్పడం ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం నేరం. సీక్రెట్ ఓటింగ్‌, సీక్రెట్ బ్యాలెట్ జరిగినప్పుడు వారు ఎవరికి ఓట్లు వేశారో దొంగతనంగా ఎలా చూశారు? అదీ మీడియా ముందు సజ్జల ఎలా చెప్పారు. దీని ప్రకారం రామకృష్ణారెడ్డిని ప్రాసిక్యూట్ చేయాలి. ఆయనపై చర్యలు తీసుకోవాలి...’ అని ఆనందబాబు డిమాండ్‌ చేశారు. ‘దళిత మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి భయపడిపోతున్నారు. సజ్జల వల్ల హాని ఉందని ఆమె వాపోతున్నారు. ఎమ్మెల్యేలపై సమన్వయకర్తలు, ఇన్‌ఛార్జులను పెట్టి అవమానించారు. బెదిరించారు. అందుకని వారు కసిగా ఉన్నారు. పది కోట్లు పెట్టి చంద్రబాబు వైకాపా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. తెదేపా ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్‌ను, కరణం బలరాం, వాసుపల్లి గణేష్‌ను ఎన్ని కోట్లు ఇచ్చి కొన్నారు? గన్నవరం ఎమ్మెల్యే వంశీని ఎన్ని కోట్లకు కొన్నారు? ఈ రెండు, మూడేళ్ల నుంచి ఎన్ని వందల కోట్లు ఇచ్చి మేపుతున్నారు వాళ్లను. మా ఎమ్మెల్యేలనేగా మీరు కొనుగోలు చేశారు. మీ ఎమ్మెల్యేలు మీపై తిరుగుబాటు ప్రకటించి మాకు ఓట్లు వేస్తే ఏదేదో మాట్లాడుతున్నారు. మీ ఎమ్మెల్యేలను మీరు అవమానించి, అనుమానించి సస్పెండ్‌ చేశారు..’ అని ఆనందబాబు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని