రాహుల్‌ను చూడాలంటే మోదీకి వణుకు

‘పార్లమెంటులో రాహుల్‌ను చూడాలంటే మోదీకి వణుకు వస్తోంది. హవాలా రూపంలో రూ.వేల కోట్లు అదానీ కంపెనీల్లోకి వచ్చాయని, ఈడీతో విచారణ చేయించాలని రాహుల్‌ కోరారు.

Published : 27 Mar 2023 03:42 IST

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎద్దేవా

ఈనాడు, హైదరాబాద్‌, గాంధీభవన్‌ - న్యూస్‌టుడే: ‘పార్లమెంటులో రాహుల్‌ను చూడాలంటే మోదీకి వణుకు వస్తోంది. హవాలా రూపంలో రూ.వేల కోట్లు అదానీ కంపెనీల్లోకి వచ్చాయని, ఈడీతో విచారణ చేయించాలని రాహుల్‌ కోరారు. అదానీ దోపిడీలో మోదీ, అమిత్‌షాల పాత్ర గురించి పార్లమెంటులో చర్చించాలని రాహుల్‌ పట్టుబడితే ఆయనపై కోర్టులో విచారణ చేయించారు’ అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కోర్టు నుంచి ఎప్పుడైనా తీర్పు 24గంటల్లో బయటికి వచ్చిందా? దాన్ని 24 గంటల్లో లోక్‌సభకు తీసుకువచ్చి ఇచ్చిందెవరు? మధ్యాహ్నం 12.30గంటలకు సభను వాయిదావేసి రాహుల్‌ను అనర్హుడిగా ప్రకటించడమేంటి? పలు రాష్ట్రాల్లో భాజపా ఎమ్మెల్యేలకు క్రిమినల్‌ కేసుల్లో శిక్షలు పడితే ఒక్కరినైనా అనర్హులుగా ఎందుకు ప్రకటించలేదు’ అని ప్రశ్నించారు. కేంద్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్నది బ్రిటిష్‌ జనతాపార్టీ (బీజేపీ) అని, అది ఆంగ్లేయుల కాలం నాటి నిరంకుశ విధానాల్నే అనుసరిస్తోందని రేవంత్‌ విమర్శించారు. రాహుల్‌కు మద్దతుగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఎంపీలంతా రాజీనామా చేయాలని పార్టీలో చర్చ జరుగుతోందని.. దీనిపై అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా అనుసరిస్తామని చెప్పారు. 

మన బలమేంటో చూపించాలి: ఠాక్రే

కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే మాట్లాడుతూ.. రాహుల్‌కి కాంగ్రెస్‌ కుటుంబం అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ బలమేంటో భాజపాకు చూపించే సమయం ఆసన్నమైందన్నారు. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇందిరాగాంధీని లోక్‌సభ నుంచి బహిష్కరించిన పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. ఇప్పుడు రాహుల్‌ను బహిష్కరించిన పార్టీ కూడా అంతరించిపోతుంది’ అన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘రాహుల్‌పై అనర్హత వేటు కంటతడి పెట్టేలాఉంది. ఆయన ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా వదులుకున్నారు. అదానీ గురించి మాట్లాడుతుండడంతో ఆయనపై కుట్ర చేశారు’ అని ఆరోపించారు. జానారెడ్డి మాట్లాడుతూ ‘అణచివేత, అప్రజాస్వామిక విధానాలు కొనసాగుతున్నాయి. రాహుల్‌కు అందరం అండగా ఉండాలి’అని సూచించారు. రేణుకా చౌదరి మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ పార్లమెంటులో నన్ను శూర్పణఖతో పోల్చారు. ఇప్పుడు మోదీ ఓబీసీ అంటున్నారు.. మరి శూర్పణఖది ఏ కులం’ అని ప్రశ్నించారు. మోదీపై కూడా పరువు నష్టం దావా వేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. దీక్షలో నదీమ్‌ జావెద్‌, వీహెచ్‌, పొన్నాల, శ్రీధర్‌బాబు, చిన్నారెడ్డి, సంపత్‌కుమార్‌, జగ్గారెడ్డి, సీతక్క, అంజన్‌కుమార్‌, సినీ నటుడు శివాజీ పాల్గొన్నారు.

ఆడ్వాణీ ప్రధాని కాకుండా మోదీ అడ్డుకున్నారు: జగ్గారెడ్డి

రాజకీయ విలువలున్న భాజపా సీనియర్‌ నాయకుడు ఎల్‌కే ఆడ్వాణీ ప్రధాని కాకుండా కుట్రలతో అడ్డుకొని మోదీ ఆ పదవిని చేపట్టారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఆయన ఆదివారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. గాంధీ కుటుంబంపై మోదీ ఎంత కక్ష పెంచుకున్నారో చెప్పడానికి రాహల్‌గాంధీపై అనర్హత వేటు నిదర్శనమన్నారు.

రాహుల్‌గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేపడుతున్నట్లు పీసీసీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్‌ మీడియా కమిటీ ఛైర్మన్‌ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.  27న అన్ని జిల్లా కేంద్రాల్లో, 28న నియోజకవర్గ కేంద్రాల్లోని గాంధీ లేదా అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద నిరసన దీక్షలు ఉంటాయన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని