Vidadala Rajini: మంత్రి రజినిపై అసమ్మతి గళం.. వ్యతిరేకంగా అభ్యర్థిని నిలుపుతామని హెచ్చరిక

రానున్న ఎన్నికల్లో మంత్రి విడదల రజినికి టికెట్‌ ఇస్తే తాము సహకరించబోమని పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన వైకాపా అసమ్మతి నాయకులు స్పష్టం చేశారు.

Updated : 14 Apr 2023 08:04 IST

గోరంట్ల(గుంటూరు), న్యూస్‌టుడే: రానున్న ఎన్నికల్లో మంత్రి విడదల రజినికి టికెట్‌ ఇస్తే తాము సహకరించబోమని పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన వైకాపా అసమ్మతి నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు గుంటూరులోని ఓ హోటల్‌లో గురువారం  పల్నాడు జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ బీద మస్తాన్‌రావును అసమ్మతి వర్గం కలిసింది.  చిలకలూరిపేటటౌన్‌, నాదెండ్ల, యడ్లపాడు మండలాల నుంచి అసమ్మతి నాయకులు ఎంపీని కలిసి మాట్లాడారు. నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశానికి  కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వడం లేదని వారు ఫిర్యాదు చేశారు.

వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా ఆమే (రజిని) ఉంటారని ఇటీవల ప్రకటించారని, ఆమెకే టికెట్‌ ఇస్తే తాము సహకరించబోమని స్పష్టం చేశారు. ఆమెను మార్చకపోతే తామే స్వతంత్ర అభ్యర్థిని పోటీలో నిలబెడతామన్నారు. ఎంపీ మస్తాన్‌రావు వారితో మాట్లాడుతూ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, సమస్యలపై మాట్లాడి సర్దుబాటు చేసుకుందామని చెప్పినట్లు సమాచారం. అసంతుష్ట నాయకులు మాత్రం తమ నిర్ణయంలో మార్పు ఉండదని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఎంపీని కలిసిన వారిలో నాదెండ్ల మాజీ ఎంపీపీ కంజుల వీరారెడ్డి, నాయకులు గొంటు శ్రీనివాసరెడ్డి, కోవెలమూడి సాంబశివరావు, చల్లా యఘ్నేశ్వరరెడ్డి, జాలాది సుబ్బారావు, గంటా హరికృష్ణ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు