Karnataka Elections - BJP: ఆ ఆరుగురి ఓటమే లక్ష్యంగా..!

ముగ్గురేమో కాంగ్రెస్‌ కీలక నాయకులు.. మరొకరేమో జేడీఎస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం.. మిగతా ఇద్దరు భాజపాలో ప్రముఖ నేతలుగా వెలిగి.. సీట్లు దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీచేస్తున్న వారు.

Updated : 02 May 2023 09:46 IST

బరిలోకి బలమైన  అభ్యర్థులను దింపిన భాజపా

ముగ్గురేమో కాంగ్రెస్‌ కీలక నాయకులు.. మరొకరేమో జేడీఎస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం.. మిగతా ఇద్దరు భాజపాలో ప్రముఖ నేతలుగా వెలిగి.. సీట్లు దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీచేస్తున్న వారు. ఈ ఆరుగురినీ మే 10న జరిగే కర్ణాటక విధానసభ ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో భాజపా పావులు కదుపుతోంది. వీరిపై బలమైన ప్రత్యర్థులను నిలిపింది. అంతేకాదు.. వీరి నియోజకవర్గాల్లో ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులనూ ప్రచారబరిలోకి దింపుతోంది.  


సిద్ధరామయ్య... X సోమణ్ణ

వరుణ.. ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య సొంత నియోజకవర్గం. ఆయనకు పోటీగా గృహ నిర్మాణశాఖ మంత్రి వి.సోమణ్ణను భాజపా అధిష్ఠానం రంగంలోకి దింపింది. నియోజకవర్గంలో లింగాయతులు, కురుబ, దళితులు అధిక సంఖ్యలో ఉన్నారు. లింగాయతుల ఓటు బ్యాంకుపై భాజపా కన్నేసి ఆ సామాజిక వర్గానికి చెందిన సోమణ్ణను బరిలో దింపింది. వరుణలో పోటీ ఈ భాజపా నేత రాజకీయ భవిష్యత్తుకు సవాల్‌గా మారింది. గెలిస్తే అధిష్ఠానం దృష్టిలో హీరో.. లేకపోతే రాజకీయంగా సమాధి అవుతారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.


లక్ష్మణ సవది... X మహేశ్‌ కుమటల్లి

భాజపా ప్రభుత్వం ఏర్పడేందుకు ప్రధాన కారకుడిగా ఖ్యాతి పొందిన లక్ష్మణసవదిని ఓడించి తీరాలని లక్ష్యంతో ఆ పార్టీ పావులు కదుపుతోంది. అతనిపై మహేశ్‌ కుమటల్లిని దింపింది. సవది ఆథణిలో గెలిస్తే పార్టీ పరువు పోతుందనే భయం భాజపాను వెంటాడుతోంది. ఆయన్ను ఓడించే బాధ్యతలను యడియూరప్పకు అప్పగించింది. అయితే ఈ ఎన్నికల్లో గెలిచి బెళగాం, విజయపుర జిల్లాలపై తన సత్తాను రుజువు చేసుకునేందుకు సవది గట్టిగా పావులు కదుపుతున్నారు.


ప్రియాంక్‌ ఖర్గే.. X మణికాంత్‌ రాథోడ్‌

చిత్తాపురలో కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రియాంక్‌ ఖర్గేను ఓడించడం ద్వారా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు గుణపాఠం చెప్పడంతో పాటు.. సొంత కుమారుడిని గెలిపించుకోలేని బలహీన నేతగా ఆయనను చూపించాలని భాజపా భావిస్తోంది. అందుకే గత లోక్‌సభ ఎన్నికల్లో ఖర్గేను ఓడించినట్లే.. ఇప్పుడు కుమారుడినీ ఇంటికి పంపాలని వ్యూహాలు పన్నుతోంది. తద్వారా జిల్లా దిల్లీ, రాష్ట్ర స్థాయిలో ఆయన పలుకుబడిని తగ్గించాలనుకుంటోంది.


డీకే శివకుమార్‌.. X అశోక్‌

కనకపుర.. కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(కేపీసీసీ) అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు పెట్టని కోట. ఇక్కడ మంత్రి ఆర్‌.అశోక్‌ను భాజపా బరిలోకి దింపింది. ఈ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు నెగ్గిన శివకుమార్‌ను ఓడించడం అంత సులభం కాదనే విషయం కమలం పార్టీకీ తెలుసు. అయినా గట్టి పోటీ ఇవ్వాలన్న లక్ష్యంతోనే అశోక్‌ను పోటీలో నిలిపింది. ఇక్కడ శివకుమార్‌ను ఓడించేందుకు భాజపా శ్రేణులూ తీవ్రంగా కృషి చేస్తున్నాయి.


జగదీశ్‌ శెట్టర్‌.. X మహేశ్‌ టెంగినకాయ

హొబ్బళ్లి-ధార్వాడ్‌ సెంట్రల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి జగదీశ్‌ శెట్టర్‌ను ఓడించి తీరుతామని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రతిజ్ఞ చేశారు. ఇక్కడ భాజపా వ్యూహాత్మకంగా శెట్టర్‌ శిష్యుడైన మహేశ్‌ టెంగినకాయను బరిలో దింపింది. శెట్టర్‌ గెలిస్తే పార్టీ బలహీనం కావడంతో పాటు లింగాయతుల్లో పట్టు సడలి పోతుందనే భయం భాజపాలో నెలకొంది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా తదితరులు ఆ నియోజకవర్గంపై ఎక్కువ దృష్టి సారించారు.


హెచ్‌.డి.కుమారస్వామి.. X సీపీ యోగీశ్వర్‌

మాజీ సీఎం హెచ్‌.డి.కుమారస్వామి పోటీ చేస్తున్న నియోజకవర్గం చెన్నపట్టణపై కాషాయదళం ఎక్కువగా దృష్టి సారించింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు ఇక్కడ ప్రచారం చేయనున్నారు. కుమారస్వామిని ఓడించడం ద్వారా ఆయన పరపతి తగ్గించాలన్నది భాజపా వ్యూహం. బలమైన సామాజిక వర్గం ఆయన వెంట ఉన్నందున ఓడించడం అంత సులభం కాదని రాజకీయ పండితులు చెబుతున్నారు.

న్యూస్‌టుడే, బెంగళూరు (యశ్వంతపుర)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు