Balineni Srinivasa Reddy: సొంత పార్టీ వాళ్లే కుట్రలు చేస్తున్నారు..

‘పార్టీలోనే కొందరు నన్ను వేధిస్తున్నారు. నాపై, నా కుమారుడిపై తీవ్రమైన నిందలు, ఆరోపణలు చేస్తున్నారు. హవాలా డబ్బులంటారు, భూ కబ్జాలంటారు.

Updated : 06 May 2023 07:49 IST

నిందలు, ఆరోపణలు భరించలేకపోతున్నాను
విలేకరులతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్న మాజీ మంత్రి

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ‘పార్టీలోనే కొందరు నన్ను వేధిస్తున్నారు. నాపై, నా కుమారుడిపై తీవ్రమైన నిందలు, ఆరోపణలు చేస్తున్నారు. హవాలా డబ్బులంటారు, భూ కబ్జాలంటారు. విశాఖపట్నం నుంచి కొన్ని విమర్శలు వస్తుంటాయి. నేను టికెట్లు ఇప్పించిన ఎమ్మెల్యేలతోనే నాపై అధిష్ఠానానికి ఫిర్యాదులు చేయిస్తున్నారు’ అని మాజీ మంత్రి, వైకాపాకు చెందిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవేదనగా వ్యాఖ్యానించారు. ఒంగోలులోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకానొక దశలో భావోద్వేగంతో ఆయన కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. సమావేశంలో పక్కనే కూర్చున్న ఆయన కుమారుడు ప్రణీత్‌రెడ్డి బాలినేనిని సముదాయించే ప్రయత్నం చేశారు. ‘సామాజిక మాధ్యమాల్లో నాకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు. కొందరు నీచులు పార్టీకి వ్యతిరేకంగా సాగిస్తున్న కార్యకలాపాలివి. నేను తొలినుంచీ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కుటుంబానికి వీర విధేయుడిని. సొంత పార్టీలోనే నాకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు చేస్తున్నారు. పార్టీ మారతానంటూ ప్రచారం చేయిస్తున్నారు. ఈ నిందలు, ఆరోపణలు భరించలేకపోతున్నా. రాజకీయంగా ఇబ్బందులెదురైనా సరే నమ్ముకున్న కార్యకర్తల్ని వదిలిపెట్టను. అవసరమైతే రాజకీయాలు వదిలేస్తా..’ అని బాలినేని ఆవేదన చెందారు.

తిరుపతిలో తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ‘వై.వి.సుబ్బారెడ్డి ఇంద్రుడు, చంద్రుడు అని పొగుడుకో మాకేం అభ్యంతరం లేదు. ఆయన నాకు రాజకీయ భిక్ష పెట్టాడని వ్యాఖ్యానించడం ఏంటి? నాకు రాజకీయ భిక్ష పెట్టింది వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి. నేను వందల కోట్లు ఎక్కడ సంపాదించానో నిరూపించాలి. జగన్‌ జైలుకు పోతాడంటావు, అవినాష్‌రెడ్డి అరెస్టయితే భారతికి నోటీసులు వస్తాయంటావు. అసలు తెలంగాణా వాడివి. ఇక్కడి రాజకీయాలతో నీకేం పని’ అని గోనె ప్రకాశరావును ప్రశ్నించారు. తాను ఎవరికీ అన్యాయం చేయలేదని.. తాను టికెట్లు ఇప్పించిన ఎమ్మెల్యేలతోనే తనపై సీఎంవోకు ఫిర్యాదులు చేయిస్తున్నారని ఆరోపించారు. సొంత నియోజకవర్గంపై మరింత దృష్టి సారించడానికి ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేశానని చెప్పారు. ఒంగోలు డీఎస్పీ నియామకం విషయాన్ని సీఎంవో దృష్టికి తీసుకెళ్లానన్నారు. తనను పార్టీలో ఎవరు ఇబ్బందులు పాల్జేస్తున్నారో అందరికీ తెలుసని, వారి పేర్లు బహిరంగంగా వెల్లడించలేనని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని