Karnataka Congress: సంకేతాలున్నా మేలుకోలేదు

కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా డి.కె.శివకుమార్‌ను నియమించిన తొలిరోజు నుంచే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశంపై పార్టీలోనే కాకుండా రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ చర్చకు తెరలేచింది.

Updated : 17 May 2023 07:46 IST

అందుకే కర్ణాటక సీఎం పదవిపై ఇంత చిక్కుముడి
ఊహించని ఘన విజయంతో పెరిగిన పోటీ
సర్దుబాటు చేయలేక ఆపసోపాలు
ఈనాడు, బెంగళూరు

కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా డి.కె.శివకుమార్‌ను నియమించిన తొలిరోజు నుంచే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశంపై పార్టీలోనే కాకుండా రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ చర్చకు తెరలేచింది. ముఖ్యమంత్రి అభ్యర్థులుగా సిద్ధరామయ్య, డీకే మధ్య పోటీ ఉంటుందని పార్టీ అధిష్ఠానానికీ తెలిసిన అంశం. ఎన్నికలకు ముందే వీరిమధ్య సయోధ్య కుదిర్చి ఉంటే ప్రస్తుతం దిల్లీ స్థాయిలో పంచాయితీ అవసరం ఉండేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధిష్ఠానంతో పాటు కర్ణాటకకు చెందిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఉదాసీనంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతామని అన్ని పార్టీల మాదిరిగా కాంగ్రెస్‌ కూడా ఆశాభావంతో ఉన్నా, ఇంతటి విజయం ఊహించనిది. బొటాబొటి మెజార్టీ అయినట్లయితే సిద్ధరామయ్య, డీకేలలో ఎవరో ఒకరు సర్దుకుపోయేవారేమో. జేడీఎస్‌ను కింగ్‌ మేకర్‌ను చేసే హంగ్‌కు గానీ, భాజపాకు ఆపరేషన్‌ కమలకు అవకాశం గానీ ఇవ్వని స్థాయిలో కాంగ్రెస్‌ విజయం సాధించటంతో అందుకు తామే కారణమనే భావన ఇద్దరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మరో ఐదేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా మారుతాయో తెలియదు కాబట్టి అంతకాలం వరకు సురక్షితంగా అధికారంలో ఉండే అవకాశాన్ని వదులుకునేందుకు ముఖ్యమంత్రి రేసులో ఉన్న నేతలే కాదు ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా లేరు. ఉప ముఖ్యమంత్రి పదవి, మంత్రివర్గంలో చోటు వంటి డిమాండ్లతో ఎమ్మెల్యేలు ఎవరికివారు పావులు కదుపుతున్నారు. 

అధికార పంపిణీకి ససేమిరా

రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ మధ్య రాజకీయ పోరుకు, తాజా కర్ణాటక కాంగ్రెస్‌ రాజకీయానికి పోలికలు మొదలయ్యాయి. సిద్ధరామయ్యకు అవకాశం ఇస్తే తన పరిస్థితి కూడా సచిన్‌ పైలట్‌లా మారుతుందన్న భయం శివకుమార్‌కు లేకపోలేదు. ఆ కారణంగానే తనను పూర్తిస్థాయి ముఖ్యమంత్రిని చేయాలని, లేదంటే ఇలాగే వదిలేయండని అధిష్ఠానానికి తెగేసి చెబుతున్నారు. సిద్ధరామయ్య ప్రతిపాదించిన 50:50 అధికార పంపిణీ ప్రతిపాదనను ససేమిరా అనేందుకు ఇదే కారణమని తెలుస్తోంది. తన వల్లనే పాతమైసూరులో ఒక్కలిగ స్థానాలు దండిగా వచ్చినట్లు ఆయన గట్టిగా చెబుతున్నారు. రాష్ట్రంలో దళితులు, ముస్లింలు, లింగాయత్‌లు కలిసి ఓటేస్తేనే 135 సీట్లు వచ్చాయని చెబుతూ మాజీ ఉప ముఖ్యమంత్రి డా.జి.పరమేశ్వర్‌, ఎం.బి.పాటిల్‌, జమీర్‌ అహ్మద్‌ వంటివారు కూడా సీఎం కుర్చీకి పోటీ పడుతున్నారు. 2013 ఎన్నికల సమయంలో సిద్ధరామయ్యతో పాటు ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీలో ఉన్న పరమేశ్వర్‌ ఆ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఈసారి ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. డీకే, సిద్ధూల మధ్య సయోధ్య కుదర్చలేని స్థితి కొనసాగితే పరమేశ్వర్‌ను, సుదీర్ఘ కాలం తర్వాత లింగాయత్‌లకు అవకాశం ఇవ్వాల్సి వస్తే ఎంబీ పాటిల్‌ను అదృష్టం వరించే అవకాశం లేకపోలేదు. చిట్టచివరి అస్త్రంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనే ముఖ్యమంత్రిని చేస్తే సిద్ధరామయ్య, డీకేలు నోరు మెదిపే అవకాశాలు ఉండవనే విశ్లేషణా కీలకంగా నిలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని