Perni Nani: బందరు రావయ్యా.. ఏదో ఒక బటన్‌ నొక్కవయ్యా..!

మన జిల్లాలో మంత్రి జోగి రమేష్‌, ఎమ్మెల్యేలు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్‌, సామినేని ఉదయభాను, రక్షణనిధిని చూస్తే కాస్త ఈర్ష్యగా ఉంటుంది.

Updated : 24 May 2023 08:57 IST

సీఎంను ఏకవచనంతో సంబోధించిన పేర్ని నాని
ఈనాడు, అమరావతి

‘నాకంటే వయస్సులో చిన్నవాడైనా.. పాదాభివందనం చేస్తున్నాను. పాలాభిషేకం చేయాలి’

‘మన జిల్లాలో మంత్రి జోగి రమేష్‌, ఎమ్మెల్యేలు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్‌, సామినేని ఉదయభాను, రక్షణనిధిని చూస్తే కాస్త ఈర్ష్యగా ఉంటుంది. ఒక్కసారి బందరు రావయ్యా.. ఇక్కడికి వచ్చి ఆటోవాళ్లకో, మత్స్యకారులకో... విద్యాదీవెనో.. ఏదో ఒక బటన్‌ నొక్కవయ్యా..! అని జగన్‌ను పిలిచాను. ఆయన రాలేదు. పాదయాత్ర సందర్భంగా ఆయన ఇచ్చిన హామీ బందరు ఓడరేవు పనులు చేపడతానని.. అప్పుడే వస్తానన్నాడు..! ఇప్పుడు బందరు వచ్చాడు’
‘సీఎం జగన్‌ను కలిసే అవకాశం మళ్లీ దక్కుతుందో లేదో.. కొద్దిగా కష్టమైనా ఉక్కపోత ఉన్నా.. భరించాల్సిందే.’
ఇది మాజీ మంత్రి బందరు ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) సోమవారం సీఎం బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు. సీఎం నేరుగా పేర్ని నానిని ఏమీ అనకపోయినా.. సీఎంవో కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి పేర్ని నానితో ఈ విషయం ప్రస్తావించినట్లు తెలిసింది.

ఏం జరిగిందంటే..!

బందరు పోర్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం మంగినపూడి నుంచి బస్సులో బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్నారు. మార్గంలో సీఎంకు కట్టిన స్వాగతతోరణాలు, ఫ్లెక్సీలో ఎక్కడ చూసినా.. పేర్ని కిట్టు పేరు, చిత్రాలతోనే ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రమే పేర్ని నాని చిత్రాలు ఉన్నాయి. బహిరంగ సభ వేదికపై పేర్ని నాని ప్రసంగించే సమయంలో అక్కడక్కడ ఏకవచనంతో సంబోధించారు. ‘రావయ్యా..‘  ‘వచ్చాడు’ వంటి పదాలు దొర్లాయి. సభ ముగిసిన తర్వాత తిరిగి బస్సులో హెలీప్యాడ్‌కు వెళ్లే సమయంలో సీఎంవో కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి ఈ అంశాన్ని పేర్ని నానితో ప్రస్తావించినట్లు తెలిసింది. సీఎంను సభలో ఏకవచనంతో సంబోధించడం సరికాదన్నారు. అలా సంబోధించడం మంచిది కాదని సూచించినట్లు సమాచారం. ఆసమయంలో బందరు ఎంపీతోపాటు కొంతమంది ఎమ్మెల్యేలు బస్సులో ఉన్నారు. ‘సీఎం వద్దంటున్నా.. పదేపదే రిటైర్‌మెంట్‌ గురించి ఎందుకు మాట్లాడతారు..? అది కరెక్టు కాదు.. ఇది ఎలాంటి సంకేతాలను సూచిస్తుంది..!’ అన్నట్లు తెలిసింది. ఇటీవల కాలంలో తాను రిటైర్‌మెంట్‌ అవుతానని నాని ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అనధికార సంభాషణల్లో సైతం తన కుమారుడు పేర్ని కిట్టు(కృష్ణమూర్తి)కి టిక్కెట్‌ అడుగుతున్నట్లు ఆయన చెబుతున్నారు. రాజకీయంగా పేర్ని కిట్టు ప్రమోషన్‌ పెద్దఎత్తున జరుగుతోంది. గడప గడపకు మన ప్రభుత్వం, స్టిక్కర్ల కార్యక్రమంతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలకు ఆయనే హాజరు అవుతున్నారు. బందరు నగరపాలక సంస్థలో, నియోజకవర్గంలో పేర్ని కిట్టు చక్రం తిప్పుతున్నారు. ఈ అంశం వైకాపా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని