తొమ్మిదేళ్లలో అద్భుత విజయాలు

పేదల సాధికారతే సమున్నత లక్ష్యంగా తొమ్మిదేళ్లుగా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన అద్భుత ఫలాలను అందించే దిశగా ముందుకు సాగుతోందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ అన్నారు.

Updated : 30 May 2023 06:23 IST

పేదల సాధికారతే లక్ష్యంగా ముందుకు
దేశ సంపూర్ణ వికాసం దిశగా పరిపాలన
కేంద్ర మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌

ఈనాడు, హైదరాబాద్‌: పేదల సాధికారతే సమున్నత లక్ష్యంగా తొమ్మిదేళ్లుగా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన అద్భుత ఫలాలను అందించే దిశగా ముందుకు సాగుతోందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ అన్నారు. పేదల సంక్షేమం, ప్రభుత్వ ఫలాలను నేరుగా ప్రజలకు అందించడమే లక్ష్యంగా కేంద్రంలో భాజపా ప్రభుత్వం పరిపాలన అందిస్తోందని తెలిపారు. విజన్‌-2047 లక్ష్యంగా దేశ సంపూర్ణ వికాసానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తొమ్మిదేళ్లలో కాంగ్రెస్‌ అవినీతి పాలనకు భిన్నంగా ప్రతి పైసా ప్రజల కోసం వ్యయం చేస్తూ ప్రపంచ దేశాల్లో భారత్‌ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తోందన్నారు. భాజపా తొమ్మిదేళ్ల పాలనపై హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడారు. మంగళవారం నుంచి నెలరోజులపాటు భాజపా మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌,  ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ముఖ్యనేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, పార్టీ నేతలు డి.ప్రదీప్‌కుమార్‌, యెండల లక్ష్మీనారాయణ, సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొమ్మిదేళ్ల మోదీ పాలనలో జరిగిన అభివృద్ధిపై పుస్తకాన్ని, ప్రత్యేకంగా రూపొందించిన గీతాన్ని విడుదల చేశారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడారు.

  ‘‘దేశంలో అవినీతికి తావులేని పారదర్శక పాలనను ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, దేశవికాసం కేంద్ర సర్కారు లక్ష్యం. ప్రభుత్వం అందించే ప్రతి పైసా పేదలకు నేరుగా అందేలా నగదు బదిలీని ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోంది. దేశంలో 11.72 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం, 12 కోట్ల ఇళ్లకు రక్షిత మంచినీటి సరఫరా, 9.6 లక్షల కుటుంబాలకు ఉజ్వల్‌ వంట గ్యాస్‌, 3.5 కోట్ల కుటుంబాలకు పీఎం ఆవాస్‌ యోజన ద్వారా ఇళ్ల నిర్మాణం సహా పలు ప్రయోజనాలను కల్పించింది. గరీబ్‌ కల్యాణ్‌ యోజన ద్వారా కొవిడ్‌ సమయంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్‌ అందించాం. ఆయుష్మాన్‌ భారత్‌ ప్రపంచంలోనే అతి పెద్ద పథకం.. పేదలకు రూ.5 లక్షల వరకు ఉచితంగా వైద్యం దీనిద్వారా అందుతుంది. మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించడంతో పాటు కొరత లేకుండా ఎరువులను రాయితీపై అందిస్తున్నాం. 74 విమానాశ్రయాల నిర్మాణం, 53 వేల కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారుల విస్తరణ, 20 వందేభారత్‌ రైళ్లు, తొమ్మిదేళ్లలో 69,663 కొత్త వైద్యవిద్య సీట్లు, 7 ఐఐటీలు, ఐఐఎంలు, యూనివర్సిటీల ఏర్పాటు, సికింద్రాబాద్‌ సహా పలు రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ చేపడుతున్నాం’’ అని అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ పేర్కొన్నారు.

మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌తో ప్రజల్లోకి: సంజయ్‌

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతూ ప్రధాని మోదీ నేతృత్వంలో తొమ్మిదేళ్ల భాజపా ప్రభుత్వం విజయాలను వివరించేందుకు ‘మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌’ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ పాలన అవినీతిమయంగా సాగిందని.. రూపాయి కేటాయిస్తే చివరకు చేరేది 15 పైసలే అని నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ అంగీకరించారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని