NCP: ఎన్సీపీలో మరో కలకలం?

అజిత్‌ పవార్‌ చీలికతో ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఎన్సీపీలో మరో కలకలం రేగింది. ఇటీవల అమిత్‌ షాతో ఆ పార్టీ మహారాష్ట్రశాఖ అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌ రహస్యంగా సమావేశమయ్యారని, త్వరలో అజిత్‌ వర్గంలో చేరనున్నారనే ప్రచారం జరిగింది.

Updated : 07 Aug 2023 08:10 IST

అమిత్‌ షాతో జయంత్‌ పాటిల్‌ సమావేశమయ్యారని ప్రచారం
కొట్టిపారేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు
శరద్‌ పవార్‌తోనేనని స్పష్టీకరణ

ముంబయి: అజిత్‌ పవార్‌ చీలికతో ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఎన్సీపీలో మరో కలకలం రేగింది. ఇటీవల అమిత్‌ షాతో ఆ పార్టీ మహారాష్ట్రశాఖ అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌ రహస్యంగా సమావేశమయ్యారని, త్వరలో అజిత్‌ వర్గంలో చేరనున్నారనే ప్రచారం జరిగింది. అయితే దీనిని పాటిల్‌ తీవ్రంగా ఖండించారు. తాను శరద్‌ పవార్‌తోనే ఉంటానని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి, భాజపా నేత ఫడణవీస్‌ కూడా అమిత్‌ షాతో పాటిల్‌ భేటీ వార్తలను ఖండించారు.

పుణెలో ఆదివారం సహకార సంఘాల కేంద్రీయ రిజిస్ట్రార్‌ డిజిటల్‌ పోర్టల్‌ను అమిత్‌ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనను పాటిల్‌ కలిశారని ప్రచారం జరిగింది. ‘శనివారం సాయంత్రం నేను శరద్‌ పవార్‌ను కలిశా. ఆ తర్వాత పార్టీ నేతలు అనిల్‌ దేశ్‌ముఖ్‌, రాజేశ్‌ టోపె, సునీల్‌ భుసరాలతో భేటీ అయ్యా. వారు అర్ధరాత్రి 1.30 వరకూ నాతోనే ఉన్నారు. మళ్లీ ఆదివారం ఉదయం పవార్‌తో భేటీ అయ్యా. నాపై దుష్ప్రచారం చేసేవారు ఏ సమయంలో అమిత్‌ షాను కలిశానో ఆధారాలు చూపించాలి. నేను ఎల్లప్పుడూ శరద్‌ పవార్‌తోనే ఉన్నా. పార్టీని చీల్చాలనే ఒత్తిడి నాపై ఏమీ లేదు. ‘ఇండియా’ సమావేశానికి సన్నాహకంగా శనివారం జరిగిన భేటీలోనూ పాల్గొన్నా’ అని జయంత్‌ పాటిల్‌ స్పష్టం చేశారు. ఇలాంటి వదంతులను ప్రచారం చేసేవారు ముందుగా నిర్ధారించుకోవాలని ఫడణవీస్‌ హితవు పలికారు.


ఆలస్యమైనా సరైన స్థానంలోకి వచ్చారు

అజిత్‌ పవార్‌తో అమిత్‌ షా వ్యాఖ్య

పుణె: చాలాకాలం తర్వాత సరైన స్థానంలోకి వచ్చారని, కానీ ఆలస్యంగా వచ్చారని ఎన్సీపీ చీలిక నేత అజిత్‌ పవార్‌తో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. ఆదివారం పుణెలో సహకార సంఘాల కార్యక్రమంలో ఇద్దరూ వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా అమిత్‌ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అజిత్‌తో కలిసి పాల్గొన్న నా మొదటి బహిరంగ సమావేశం ఇది. ఆయన ఇప్పుడు సరైన స్థానంలో కూర్చున్నారని చెప్పదలుచుకున్నా. కానీ ఆలస్యంగా వచ్చి కూర్చున్నారు’ అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, ఉప ముఖ్యమంత్రులు ఫడణవీస్‌, అజిత్‌ పవార్‌ పాల్గొన్నారు. ‘అమిత్‌ షా మహారాష్ట్ర అల్లుడు. తన సొంత రాష్ట్రం గుజరాత్‌ కంటే మహారాష్ట్రపై ఎక్కువ ప్రేమ ఆయనకు ఉంది. ఔనన్నా కాదన్నా అత్తింటిపైనే ఎవరికైనా ప్రేమ అధికంగా ఉంటుంది’ అని అజిత్‌ పవార్‌ పేర్కొన్నారు. షా సతీమణి మహారాష్ట్రలోని కొల్హాపుర్‌కు చెందినవారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని