Raghu Rama Krishna Raju: రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తారని ప్రభుత్వానికి ముందే ఎలా తెలుసు?

మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుకు ప్రాణ హాని పొంచి ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. గతంలో మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో సాక్ష్యాలు రూపుమాపేందుకు జైలులోనే హత్య చేసిన ఘటనలున్నాయని పేర్కొన్నారు.

Updated : 12 Sep 2023 08:55 IST

ఈ కేసులో తొలుత అజేయ కల్లం, ప్రేమచంద్రారెడ్డిలను అరెస్టు చేయాలి
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుకు ప్రాణ హాని పొంచి ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. గతంలో మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో సాక్ష్యాలు రూపుమాపేందుకు జైలులోనే హత్య చేసిన ఘటనలున్నాయని పేర్కొన్నారు. తనను కూడా గుంటూరు జైలులో హత్య చేయాలని పథక రచన చేశారని, వేంకటేశ్వర స్వామి దయ, సుప్రీంకోర్టు తీర్పుతో బతికి బయటపడ్డానని తెలిపారు. మరో మూడు నాలుగు రోజులపాటు జైలులోనే ఉంటే తనను కచ్చితంగా హత్య చేసి ఉండేవారన్నారు. దిల్లీలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబుపై మోపిన కేసులో పస లేదని.. కేవలం నస, కసి మాత్రమే ఉన్నాయని ఎంపీ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును రాజమహేంద్రవరం జైలుకు తరలించాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇవ్వక ముందే ఆ నగరంలో 144 సెక్షన్‌ విధించడం, రహదారిని క్లియర్‌ చేయడం వంటి ఘటనలు పరిశీలిస్తే తీర్పు ఏమిటో ప్రభుత్వానికి ముందే తెలుసనే భావన నెలకొందన్నారు. నైపుణ్య శిక్షణ కోసం గత ప్రభుత్వం కేవలం రూ.370 కోట్లు మాత్రమే విడుదల చేస్తే అందులో రూ.550 కోట్ల అక్రమాలు జరిగాయని పేర్కొనడం అర్థరహితమన్నారు.

విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి సీమెన్స్‌ సంస్థతో గత ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుందని, శిక్షణకు అయ్యే ఖర్చులో కేవలం 10 శాతం నిధులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. 2.63 లక్షల మంది విద్యార్థులు నైపుణ్య శిక్షణ పొందారని, వారిలో 80 శాతం మంది విద్యార్థులు ఆ శిక్షణ ద్వారా వివిధ స్థాయుల్లో ఉద్యోగాలను సంపాదించారన్నారు. సీమెన్స్‌ సంస్థతో గత ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకునే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్న అజేయ కల్లం ఆర్థిక శాఖ వ్యవహారాలనూ పర్యవేక్షించారన్నారు. నైపుణ్య శిక్షణ కార్యకలాపాలను కార్యదర్శి హోదాలో ప్రేమచంద్రా రెడ్డి నిర్వహించారని గుర్తు చేశారు. అందులో ఒకవేళ అవినీతి చోటుచేసుకుంటే ముందు అజేయ కల్లం, ప్రేమచంద్రారెడ్డిలను అరెస్టు చేసిన తర్వాతే మిగతా వారిని అరెస్టు చేయాలన్నారు. సిట్‌ అధికారిగా వ్యవహరిస్తున్న రఘురామిరెడ్డి జిహాదీ బ్యాచ్‌లా వ్యవహరిస్తున్నారని ఎంపీ ధ్వజమెత్తారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తుండడంతో బాధతో అనేక మంది అర్ధాంతరంగా తనువు చాలించారని ఆవేదన వ్యక్తం చేశారు. అవన్నీ జగన్‌ ప్రభుత్వం చేసిన హత్యలేన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు