BRS: నేడు భారాసలోకి రావుల, జిట్టా

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిలు శుక్రవారం భారాసలో చేరనున్నారు.

Updated : 20 Oct 2023 08:05 IST

ఈనాడు-మహబూబ్‌నగర్‌, భువనగిరి-న్యూస్‌టుడే: తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి(Ravula Chandrasekhar), కాంగ్రెస్‌ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి(Jitta Balakrishna Reddy)లు శుక్రవారం భారాసలో చేరనున్నారు. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో రావుల; మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు సమక్షంలో జిట్టా గులాబీ కండువా కప్పుకోనున్నారు. రావుల వనపర్తి నియోజకవర్గం నుంచి 1994, 2009లలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా పనిచేశారు. 2002 నుంచి 2008 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2014లో తెదేపా తరపున వనపర్తిలో పోటీ చేసి.. ఓటమి పాలయ్యారు. భారాసలో చేరికపై రావులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ రమణలు ఇటీవల చర్చించినట్లు సమాచారం. ఈ విషయాన్ని మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుల దృష్టికి తీసుకెళ్లడంతో రావుల చేరిక ఖరారైంది. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో భారాస తరఫున పోటీ చేసేందుకు రావుల ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది.

14 ఏళ్ల తర్వాత.. సొంత గూటికి

జిట్టా బాలకృష్ణారెడ్డి గతంలో తెరాస(ప్రస్తుతం భారాస) యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో భువనగిరి అసెంబ్లీ టికెట్‌ దక్కకపోవడంతో పార్టీని వీడారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. ఉమామాధవరెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతరం యువ తెలంగాణ పార్టీ స్థాపించారు. ఆ తర్వాత వైకాపాలో చేరారు. మళ్లీ యువ తెలంగాణ పార్టీ పేర కార్యక్రమాలు చేపట్టారు. 2018 ఎన్నికల్లో భాజపా మద్దతుతో యువ తెలంగాణ అభ్యర్థిగా, 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గత ఏడాది భాజపాలో, ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంపై జిట్టా అసంతృప్తితో ఉన్నారు. బాలకృష్ణారెడ్డితో గురువారం ఉదయం భువనగిరి ఎమ్మెల్యే, భారాస అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి తొలుత హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో.. అనంతరం మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు సమక్షంలో చర్చలు జరిపారని సమాచారం. సొంత గూటికి తిరిగిరావాలని కోరగా.. ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేటీఆర్‌, హరీశ్‌ సమక్షంలో ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డితో చర్చలు జరిపిన మాట వాస్తవమేనని జిట్టా ధ్రువీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని