Kadiri MLA Sidda Reddy: నెల పింఛన్లు ఆపితే రోడ్లు అద్దంలా చేయొచ్చు: కదిరి ఎమ్మెల్యే

సామాజిక పింఛన్లు ఒక నెల పంపిణీ చేయడం ఆపితే రోడ్లు అద్దంలా చేయొచ్చని శ్రీసత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే డాక్టర్‌ పి.వి.సిద్ధారెడ్డి అన్నారు.

Updated : 25 Nov 2023 07:20 IST

తనకల్లు, న్యూస్‌టుడే: సామాజిక పింఛన్లు ఒక నెల పంపిణీ చేయడం ఆపితే రోడ్లు అద్దంలా చేయొచ్చని శ్రీసత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే డాక్టర్‌ పి.వి.సిద్ధారెడ్డి(Kadiri MLA Sidda Reddy) అన్నారు. తనకల్లు మండలంలోని చిన్నరామన్నగారిపల్లి పంచాయతీ తురకవాండ్లపల్లి గ్రామస్థులు పది మందికిపైగా శుక్రవారం కదిరిలోని ఎమ్మెల్యే నివాసానికి వచ్చారు. తమ గ్రామ రహదారి అధ్వానంగా ఉందని, రోడ్డు వేయాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘ఒక నెలైనా వృద్ధులు పింఛను ఇవ్వకుంటే ఒప్పుకొంటారా? ప్రతి నెలా 1న కదిరికే రూ.15 కోట్ల పింఛన్ల సొమ్ము వస్తోంది. అవి ఆపి రహదారుల నిర్మాణానికి వెచ్చిస్తే రోడ్లన్నీ అద్దంలా తయారుచేయొచ్చు. మొదటి ప్రాముఖ్యం వాటికి (పింఛన్లు).. తరువాత ఏవైనా..’ అని అన్నారు. ఎమ్మెల్యే మాటలతో కంగుతిన్న గ్రామస్థులు నిరాశతో వెనుదిరిగారు.

నాలుగేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం

బందార్లపల్లి రహదారి నుంచి తురకవాండ్లపల్లి గ్రామంలోకి రెండు కి.మీ.మేర రోడ్డు కంకర తేలి గుంతలు పడి రాకపోకలు సాగించేందుకు అనువుగా లేదు. అధ్వానమైన రహదారిపై రాకపోకలు సాగించే క్రమంలో వృద్ధులు, గర్భిణులు ప్రమాదాలకు గురవుతున్నారు. నాలుగేళ్లనుంచి ఈ రహదారి మరమ్మతు, నిర్వహణ చేపట్టకపోవడంతో రోడ్డు నామరూపాల్లేకుండా పోయింది. దీంతో స్థానికులు అవస్థలు పడటంతోపాటు ఆసుపత్రుల పాలవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని