Nara Lokesh: వైకాపా దోచిన డబ్బును ప్రజలకు ఇప్పిస్తాం

‘నేను తప్పుచేస్తే.. చంద్రబాబే జైలుకు పంపుతారు. ఏ తప్పూచేయలేదు కనుకే.. ధైర్యంగా రాజోలు సభలో ‘సైకో జగన్‌’ అని పిలవగలుగుతున్నా’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు.

Updated : 28 Nov 2023 04:52 IST

వ్యవస్థలను మేనేజ్‌ చేసి చంద్రబాబును జైల్లో ఉంచారు
సజ్జల ఆధ్వర్యంలో రాజోలు నియోజకవర్గంలో భూదందా
తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌
పొదలాడలో పునఃప్రారంభమైన యువగళం పాదయాత్ర
మద్దతు పలికిన జనసేన శ్రేణులు

ఈనాడు, కాకినాడ, రాజమహేంద్రవరం: ‘నేను తప్పుచేస్తే.. చంద్రబాబే జైలుకు పంపుతారు. ఏ తప్పూచేయలేదు కనుకే.. ధైర్యంగా రాజోలు సభలో ‘సైకో జగన్‌’ అని పిలవగలుగుతున్నా’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడలో యువగళం 210వ రోజు పాదయాత్ర సోమవారం పునఃప్రారంభమైంది. జనసేన శ్రేణులు మద్దతు తెలిపాయి. తాటిపాక కూడలి వద్ద నిర్వహించిన బహిరంగ సభలో లోకేశ్‌ మాట్లాడారు. మీరు కేసులు పెట్టుకుంటూ పోతే భయపడడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు.. భయాన్ని మీకు పరిచయం చేసే బాధ్యత తీసుకుంటా.. అని హెచ్చరించారు. ‘‘ప్రజల మద్దతే చంద్రబాబుకు కొండంత బలం. వ్యవస్థలను మేనేజ్‌ చేసి జైలులో బంధించారు. కనీసం మా కుటుంబం, తెదేపా ఖాతాలకు ఒక్క రూపాయి అవినీతి సొమ్ము వచ్చిందని నిరూపించారా? ప్రజలే ఆలోచించాలి. హైకోర్టు నిజాన్ని నిలబెట్టింది. త్వరలో అన్న క్యాంటీన్‌ విషయంపైనా బాబుపై కేసు పెడతారు. పేదలకు అన్నంపెట్టి రాష్ట్ర ఖజానాకు అన్యాయం చేశారని రిమాండ్‌ రిపోర్టులో రాస్తారు’’ అని లోకేశ్‌ ఎద్దేవాచేశారు.

ప్రజలంతా మావెంటే..

‘‘ప్రజలు, ప్రజల కోసం పోరాడే పార్టీలు చంద్రబాబుకు అండగా నిలబడ్డాయి. పవన్‌ కల్యాణ్‌తోపాటు దేశంలోని నేతలంతా బాసటగా నిలిచారు. అందరికీ రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి.. వడ్డీతో సహా కేసులు పెట్టే బాధ్యత తీసుకుంటా. సైకో జగన్‌ పాలనలో సామాజిక అన్యాయం చూస్తే చాలా బాధేస్తోది. అమర్‌నాథ్‌ గౌడ్‌ లాంటి బీసీ కుర్రాళ్లను పెట్రోలు పోసి చంపారు. 26 వేల మంది బీసీలపై దొంగకేసులు పెట్టారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తాం. దళితులకు దక్కాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలను జగన్‌ రద్దుచేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆ పథకాలన్నీ పునరుద్ధరిస్తాం. వైకాపా నాయకులు దోచేసిన డబ్బులను ప్రజలకు ఇప్పించే బాధ్యత తెదేపా-జనసేన తీసుకుంటాయి.

జగన్‌కు రెండు బటన్లు..

జగన్‌ కటింగ్‌ మాస్టర్‌.. ఫిటింగ్‌ మాస్టర్‌. ఆయన బల్లపైన బ్లూ బటన్‌, బల్ల కింద ఎర్ర బటన్‌. పైది నొక్కితే రూ.10 పడుతుంది.. కింద బటన్‌ నొక్కితే రూ.100 హుష్‌మని పోతుంది. రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు తొమ్మిదిసార్లు, ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచారు. తాడేపల్లి ప్యాలెస్‌ బ్రోకర్‌ సజ్జల ఆధ్వర్యంలో రాజోలు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున భూదందా జరుగుతోంది. పేదల నుంచి తక్కువ ధరకు భూములు కొని మూడురెట్లు ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్మేస్తున్నారు.

20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం

యువత ఎప్పుడూ పేదరికంతో ఉండాలన్నదే జగన్‌ ఉద్దేశం. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత అయిదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటా. ప్రతినెలా రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం.

రైతుకు ఏడాదికి రూ.20 వేలు

జగన్‌ పాలనలో క్రాప్‌, ఆక్వా, పవర్‌ హాలిడే వచ్చింది. తెదేపా ‘అన్నదాత సుఖీభవ’ ద్వారా రైతుకు ఏడాదికి  రూ.20వేలు ఇచ్చి ఆదుకుంటుంది. సీపీఎస్‌ రద్దుచేస్తానని చెప్పి ఉద్యోగులను జగన్‌ మోసం చేశారు. పోలీసుల టీఏ, జీపీఎఫ్‌, సరెండర్‌ లీవుల మొత్తం ఎగ్గొట్టారు. తెదేపా-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నివర్గాల సమస్యలూ పరిష్కరిస్తాం’’ అని లోకేశ్‌ హామీ ఇచ్చారు. రూ. 450 కోట్లతో రుషికొండకు గుండుకొట్టి ఇల్లు కట్టుకున్నాడు.. నాలున్నరేళ్లుగా పేదలకు 450 ఇళ్లు మాత్రమే కట్టాడు. అవీ నాసిరకమైనవి.. అంటూ ఎద్దేవా చేశారు.


తప్పుచేసిన జగన్‌ను ఎక్కడ పెట్టాలి?

ఏ తప్పూ చేయని చంద్రబాబును 53 రోజులు జ్యుడిషియల్‌ రిమాండ్‌లో పెడితే.. 38 కేసులున్న.. రూ.43 వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీచేసిన జగన్‌ను ఎక్కడ పెట్టాలో ప్రజలే ఆలోచించాలి. వైకాపా నాయకులు దోచేసిన డబ్బులను ప్రజలకు ఇప్పించే బాధ్యత తెదేపా-జనసేన తీసుకుంటాయి. ఇదే స్పీడులో మనం వెళ్తే వైకాపా మొత్తం జైలులో ఉంటుంది. జైలర్‌ ఎవరో తెలుసా.. చంద్రబాబే.


అడ్డుకుంటే దండయాత్ర..

యువగళాన్ని ఆపడానికి వైకాపా కుట్రలు చేసింది. చిత్తూరులో మాట్లాడుతుంటే మైకు లాగారు. ఇది ఎన్టీఆర్‌ ఇచ్చిన గొంతు. ఆనాడే చెప్పా.. సహకరిస్తే పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర అని. యాత్రను ఆపడానికి చంద్రబాబును అరెస్టుచేశారు. మూడే మూడు నెలల్లో జగన్‌ను పిచ్చాసుపత్రికి పంపించే బాధ్యతను మనందరం తీసుకోవాలి.

యువగళం బహిరంగ సభలో లోకేశ్‌


చలికాలంలోనూ ఫ్యాన్‌కు ఉక్కబోస్తోంది..

‘చలికాలంలోనూ ఫ్యాన్‌కు ఉక్కబోస్తోంది. గడప గడపకు వైకాపా నాయకులు వెళ్తే..  ప్రజలు రా..రా.. అంటూ కొట్టి పంపించారు. బస్సు యాత్ర తుస్సయ్యింది. వై ఏపీ నీడ్‌ అంట.. నాలుగున్నరేళ్లుగా వేధించింది చాలు, నిన్ను తరిమికొట్టడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారు.’

యువగళం బహిరంగ సభలో లోకేశ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని