వైకాపా అధిష్ఠానానికి నగరి అసమ్మతి నేతల ఝలక్‌

చిత్తూరు జిల్లా నగరి సీటును మంత్రి రోజాకు కేటాయిస్తే తాము పని చేయమని వైకాపా అసమ్మతి నేతలు తెగేసి చెప్పినా, రెండ్రోజుల క్రితం ఆమె అభ్యర్థిత్వాన్నే జగన్‌ ఖరారు చేశారు.

Published : 19 Mar 2024 05:00 IST

మంత్రి పెద్దిరెడ్డిని కలిసిన రోజా

పుత్తూరు, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా నగరి సీటును మంత్రి రోజాకు కేటాయిస్తే తాము పని చేయమని వైకాపా అసమ్మతి నేతలు తెగేసి చెప్పినా, రెండ్రోజుల క్రితం ఆమె అభ్యర్థిత్వాన్నే జగన్‌ ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో అసమ్మతి నాయకులైన వడమాలపేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి, రాష్ట్ర బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి ఏలుమలై, శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్‌ చక్రపాణిరెడ్డి, లక్ష్మీపతిరాజు, ఎంపీటీసీ సభ్యుడు భాస్కర్‌రెడ్డి, మాజీ సర్పంచి రవిశేఖర్‌రాజు, ఎస్వీయూ పాలకమండలి సభ్యుడు నారాయణబాబు తదితరులకు సోమవారం అమరావతికి రావాలని అధిష్ఠానం నుంచి పిలుపువచ్చింది. ఉదయం 9 గంటలకే అక్కడకు చేరుకున్న వారిని మధ్యాహ్నం కలవాలని చెప్పడంతో తిరిగి అతిథిగృహానికి వచ్చేశారు. మంగళవారం అక్కడకు మంత్రి రోజాను సైతం పిలిపించి ఇరువర్గాల నడుమ సయోధ్య కుదిర్చేందుకు అధిష్ఠానం ఇలా చేసిందని వారికి అనుమానం వచ్చింది. అలా కలవడం ఇష్టంలేక వారు మళ్లీ నగరికి వచ్చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు సోమవారం మంత్రి పెద్దిరెడ్డిని తిరుపతిలోని ఆయన స్వగృహంలో రోజా కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిన్నటివరకు తన నియోజకవర్గంలో అసమ్మతికి పెద్దిరెడ్డే కారణమని పలు సందర్భాల్లో ప్రస్తావించిన ఆమె.. ఇప్పుడు తన భర్త సెల్వమణి, సోదరుడు రాంప్రసాద్‌రెడ్డిలతో ఆయన్ను కలవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని