TS Elections: రాష్ట్రంలో ఆరు సీట్లపై ఏకాభిప్రాయం!

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రంగంలోకి దింపే అభ్యర్థులపై కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ(సీఈసీ) కసరత్తు చేసింది.

Updated : 20 Mar 2024 07:55 IST

పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌, ఆదిలాబాద్‌, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ స్థానాలపై కసరత్తు కొలిక్కి
11 రాష్ట్రాల్లో 80 మంది అభ్యర్థుల ఎంపికపై సీఈసీ చర్చ

ఈనాడు- హైదరాబాద్‌, దిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రంగంలోకి దింపే అభ్యర్థులపై కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ(సీఈసీ) కసరత్తు చేసింది. తెలంగాణలో ప్రకటించాల్సిన 13 స్థానాల్లో ఏడింటిపై చర్చ జరగ్గా ఆరు స్థానాలకు సంబంధించి దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. మంగళవారం సాయంత్రం ఇక్కడి ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత సోనియాగాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీవేణుగోపాల్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో మొత్తం 11 రాష్ట్రాలకు చెందిన 80 స్థానాలపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ హాజరయ్యారు.

తెలంగాణ నుంచి ఇంకా ప్రకటించాల్సి ఉన్న 13 స్థానాలకు గాను ఒక్కో పేరు సూచించిన 7 స్థానాలపైనే చర్చ జరిగినట్లు సమాచారం. వీటిలో భువనగిరి మినహా మిగిలిన ఆరు స్థానాలలో అభ్యర్థుల పేర్లకు సీఈసీ దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పెద్దపల్లికి గడ్డం వంశీ, చేవెళ్లకు సిటింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి, మల్కాజిగిరికి సునీతారెడ్డి, నాగర్‌కర్నూల్‌కు మల్లురవి, ఆదిలాబాద్‌ స్థానానికి ఆత్రం సుగుణ, సికింద్రాబాద్‌కు దానం నాగేందర్‌ల పేర్లపై సీఈసీలో చర్చ జరగ్గా.. ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. భువనగిరికి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేరును రాష్ట్ర కమిటీ ప్రతిపాదించగా కోమటిరెడ్డి లక్ష్మికి ఇవ్వాలని మరో ప్రతిపాదన రావడంతో పెండింగులో పెట్టినట్లు సమాచారం. మిగిలిన ఖమ్మం, వరంగల్‌, హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ నియోజకవర్గాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అభ్యర్థుల ఖరారులో జాప్యంపై చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సునాయాసంగా నెగ్గిన జిల్లాల్లో సైతం అభ్యర్థులను ఖరారు చేయడంలో జాప్యం జరుగుతుండటంపై సీఈసీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో 12 నుంచి 14 లోక్‌సభ స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. కొన్ని స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో ఇంకా ఎందుకు జాప్యం జరుగుతోందని చర్చించినట్లు సమాచారం. పార్టీ గెలుస్తుందని ఎక్కువమంది నేతలు పోటీపడుతున్నందున రాష్ట్రస్థాయి స్క్రీనింగ్‌ కమిటీ ఒక్కో స్థానానికి ఒక్కో అభ్యర్థిని ఎంపిక చేయలేకపోయినట్లు సీఈసీకి నేతలు వివరించినట్లు తెలుస్తోంది.

21న మళ్లీ సీఈసీ సమావేశం

దేశవ్యాప్తంగా తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, ఛత్తీస్‌గఢ్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులు, పుదుచ్చేరి, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌లలోని 80 స్థానాలకు గాను 5 చోట్ల మినహా మిగిలిన అన్నింటిపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఒకటి రెండురోజుల్లో మూడో జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మళ్లీ 21వతేదీన సీఈసీ సమావేశం దిల్లీలో జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని