ఆ ‘మాయ’ ఏమైనట్టు?

దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తర్‌ ప్రదేశ్‌లో రాజకీయాలంటే మాటలు కాదు. అన్ని వర్గాల్లో పట్టు సాధించి అధికారం చేపట్టాలంటే ఎంతో చెమటోడ్చాల్సి ఉంటుంది.

Updated : 16 Apr 2024 06:47 IST

యూపీలో ప్రాభవం కోల్పోతున్న బీఎస్పీ
ఈసారి ఒంటరిగానే బరిలోకి..
దళితులు, ముస్లింల ఓట్లపై ఆశ

దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తర్‌ ప్రదేశ్‌లో రాజకీయాలంటే మాటలు కాదు. అన్ని వర్గాల్లో పట్టు సాధించి అధికారం చేపట్టాలంటే ఎంతో చెమటోడ్చాల్సి ఉంటుంది. అలాంటి రాష్ట్రంలో ఒక మహిళ ఏకంగా నాలుగు సార్లు అధికారం చేపట్టారంటే ఆమె ఎంత ప్రాభవం సంపాదించారో అర్థం చేసుకోవచ్చు. అలాంటి దిగ్గజ మహిళ అయిన బీఎస్పీ అధినాయకురాలు మాయావతి క్రమంగా రాజకీయాలపై పట్టు కోల్పోతున్నారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం అండతో ఒకప్పుడు యూపీలో తిరుగులేని నేతగా ఎదిగి ముఖ్యమంత్రిగా అధికారం చెలాయించిన మాయావతి ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తూ అత్యంత కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నారు.

  • 2007లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 206 సీట్లలో విజయం సాధించి సొంతంగానే అధికారం చేపట్టిన బీఎస్పీ 2022కు వచ్చేసరికి కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది.
  • 2019లో ఎస్పీ-బీఎస్పీ కలిసి పోటీ చేశాయి. బీఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేసి 10 చోట్ల గెలిచింది. ఎస్పీ 37 చోట్ల పోటీ చేసి 5 స్థానాల్లో విజయం సాధించింది. 2014లో ఒంటరిగా పోటీ చేసిన బీఎస్పీ ఒక్క సీటూ గెలవలేకపోయింది.

మాయావతి ఆశ

ఈసారి కేంద్రంలో ఎన్డీయేగానీ, ఇండియా కూటమిగానీ మెజారిటీ స్థానాలను సాధించకూడదని మాయావతి కోరుకుంటున్నారు. కేంద్రంలో బలహీన ప్రభుత్వం ఉండాలనేది ఆమె ఆకాంక్ష. అప్పుడు తాను కీలక పాత్ర పోషించవచ్చని భావిస్తున్నారు. 

  •  భాజపాపై ప్రత్యర్థులను నిలపడంలోనూ మాయావతి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. గాజియాబాద్‌లో రెండుసార్లు గెలిచిన ఠాకుర్‌ నేత వీకే సింగ్‌కు భాజపా టికెట్‌ నిరాకరించింది. అక్కడ బీఎస్పీ ఠాకుర్‌కు టికెటిచ్చింది.
  • మేరఠ్‌లో భాజపా అభ్యర్థి అరుణ్‌ గోవిల్‌ను ఎదుర్కోవడానికి ఆ ప్రాంతంలో పట్టున్న త్యాగి వర్గానికి చెందిన దేవవ్రత్‌ త్యాగిని మాయావతి అభ్యర్థిగా నిలిపారు.
  •  దళిత-ముస్లిం ఓట్లను సాధించడంద్వారా పూర్వ వైభవం సాధించాలని మాయావతి భావిస్తున్నారు. గతంలో ఈ ఫార్ములా బాగా పని చేసింది.

మేనల్లుడికి బాధ్యతలు

పార్టీ బాధ్యతలను తన మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్‌కు గత డిసెంబరులో మాయావతి అప్పగించారు. దళిత యువత ఓట్లను సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించాలనేది ఆమె కోరిక.

 దళితుల్లో తమకున్న పట్టును నిలుపుకొనేందుకు బీఎస్పీ క్షేత్ర స్థాయిలో సమావేశాలను నిర్వహిస్తోంది. రహస్యంగానూ వారితో భేటీ అవుతోంది.


వైఫల్యాలు

దళిత ఓటు బ్యాంకుతోపాటు ఇతర వర్గాల ఓట్లను సాధించి సీట్లుగా మలుచుకోవడంలో మాయావతి ఇటీవలి కాలంలో విఫలమవుతున్నారనే భావన వ్యక్తమవుతోంది. గతంలో చేసిన ప్రయోగాల నుంచి వెనక్కి తగ్గకున్నా పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదు.

  •  2014లో భాజపా విజయ ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుంచి బీఎస్పీ ప్రాభవం కోల్పోవడం మొదలైంది. అప్పటి నుంచి దళితుల్లో పలు ఉప కులాలవారు భాజపావైపు మొగ్గుచూపడం ప్రారంభించారు.
  •  పలు అంశాల్లో మాయావతి వైఖరి నచ్చని ముస్లింలు ఆమెకు దూరమయ్యారు.
  •  2022 ఎన్నికల తర్వాత ఆ విషయాన్ని గుర్తించి పలువురు ముస్లింలకు టికెట్లు ఇచ్చినా ఆమె వారి మద్దతును పొందలేకపోయారు.

 కచ్చితమైన ఓటు బ్యాంకు

బీఎస్పీకి ఇప్పటికీ యూపీలో ఏ పార్టీకీ లేనంతగా కచ్చితమైన ఓటు బ్యాంకు ఉంది. యూపీలో 21శాతం దళిత ఓట్లున్నాయి. అందులో సగానికి ప్రాతినిధ్యం వహించే జాటవ్‌లు మాయావతి వెంటే ఉన్నారు. వారితోపాటు ముస్లింల ఓట్లను సాధిస్తే లోక్‌సభ సీట్లను గెలవవచ్చని మాయావతి అంచనాగా ఉంది. అందుకే తొలి విడతలో ప్రకటించిన 16 స్థానాల్లో ఏడింటిని ఆమె ముస్లిం అభ్యర్థులకు కేటాయించారు. తద్వారా ఎస్పీ-కాంగ్రెస్‌ కూటమికి చెక్‌ పెట్టవచ్చనేది ఆమె అంచనా.


4.1 కోట్ల మంది దళితులు

2011 జనాభా లెక్కల ప్రకారం.. యూపీలో దళితుల సంఖ్య 4.1 కోట్లు. వారిలో 66 ఉప కులాలున్నాయి. జాటవ్‌లు 2.2 కోట్ల మంది ఉంటారు. వారి వాటా 54 శాతం.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో 22 శాతం ఓట్లతో 19 సీట్లు సాధించిన బీఎస్పీ 2022లో 12.9 శాతం ఓట్లు సాధించినా కేవలం ఒక్క సీటే గెలుచుకుంది.

 ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు