అందని ద్రాక్షలు అందిన వేళ!

పార్టీ ఆవిర్భావం నుంచీ అందని ద్రాక్షలుగానే ఊరించినవాటిలో 29 నియోజకవర్గాలను 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఎట్టకేలకు తొలిసారి గెలుచుకుంది.

Updated : 16 Apr 2024 06:12 IST

2019లో 29 చోట్ల  తొలిసారి భాజపా గెలుపు
వాటిలో ప్రస్తుత ఫలితాలపై సర్వత్రా ఆసక్తి

ఈనాడు, దిల్లీ: పార్టీ ఆవిర్భావం నుంచీ అందని ద్రాక్షలుగానే ఊరించినవాటిలో 29 నియోజకవర్గాలను 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఎట్టకేలకు తొలిసారి గెలుచుకుంది. వాటిలో 8 ఎస్సీ, 5 ఎస్టీ రిజర్వుడు స్థానాలున్నాయి. మొత్తంగా ఈ 29 సీట్లలో 15 పశ్చిమ బెంగాల్‌లోనివే. 2014లో 282గా నమోదైన భాజపా సంఖ్యాబలం 2019లో 303కు పెరగడంలో ఈ విజయాలు బాగా దోహదపడ్డాయి. అయిదేళ్ల కిందట తొలిసారి గెల్చుకున్న ఈ స్థానాల్లో కమలనాథులకు ప్రస్తుతం ఎలాంటి ఫలితాలు వస్తాయన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.


బెంగాల్‌లో దూకుడు

బెంగాల్‌లో 2014 నాటి సార్వత్రిక సమరంలో  17.02% ఓట్లతో కేవలం రెండు సీట్లు గెలుచుకున్న భాజపా.. 2019 నాటికల్లా 40.64% ఓట్లతో 18 స్థానాల్లో జయభేరి మోగించింది. వామపక్ష ప్రభుత్వం ఉన్నంతకాలం బెంగాల్‌లో రాజకీయాలు.. వామపక్షాలు, వాటి వ్యతిరేక పక్షాల మధ్య పోటీగానే కనిపించాయి. అప్పట్లో లెఫ్ట్‌ఫ్రంట్‌ను గద్దెదింపాలనుకున్న వారంతా మమతా బెనర్జీకి మద్దతు పలికారు. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలు మమత, ఆమె వ్యతిరేక వర్గాల మధ్య పోరుగా మారాయి. మమత నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఓడించే శక్తిని వామపక్షాలు కోల్పోవడంతో.. వాటి సానుభూతిపరులంతా అయిదేళ్ల కిందట భాజపావైపు మళ్లారు. ఫలితంగా ఆ పార్టీ ఓటుబ్యాంకు భారీగా పెరిగింది. 2014తో పోలిస్తే 2019 నాటికి సీపీఎం ఓటుబ్యాంకు 22.96% నుంచి 6.34%కు, సీపీఐ ఓటుబ్యాంకు 2.36% నుంచి 0.40%కు తగ్గింది. కాంగ్రెస్‌ ఓట్లశాతం 9.69% నుంచి 5.66%కు పడిపోయింది. 2019లో బెంగాల్‌లో కాంగ్రెస్‌ కేవలం 2 సీట్లు గెల్చుకోగా, సీపీఎం ఒక్క స్థానాన్నీ దక్కించుకోలేకపోయింది. 2014తో పోలిస్తే 2019 నాటికి తృణమూల్‌ ఓటుబ్యాంకు 39.27% నుంచి 43.69%కు పెరిగినా.. ఆ పార్టీ సీట్లు మాత్రం 34 నుంచి 22కు పడిపోయాయి. మమతను వ్యతిరేకించే శక్తులన్నీ అయిదేళ్ల కిందటే భాజపావైపు మళ్లడంతో.. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఖాతాలో కొత్తగా వచ్చి చేరే ఓటుబ్యాంకు ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ మాత్రం ఈసారి బెంగాల్‌లో భాజపా అత్యధిక సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని జోస్యం చెబుతున్నారు.


హరియాణాలో గట్టి సవాల్‌

హరియాణాలో భాజపా 2019లో సిర్సా, రోహ్‌తక్‌, హిసార్‌ స్థానాలను తొలిసారి కైవసం చేసుకుంది. దాంతో రాష్ట్రంలోని మొత్తం 10 సీట్లను క్లీన్‌స్వీప్‌ చేసినట్లయింది. మరోసారి రాష్ట్రంలో క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన కమలదళానికి.. అయిదేళ్ల కిందటే తొలిసారి దక్కిన మూడు స్థానాలు ఇప్పుడు సవాల్‌ విసురుతున్నాయి. సిర్సాలో సిట్టింగ్‌ ఎంపీ సునీత దుగ్గల్‌ను మార్చి.. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆమె చేతిలో ఓడిన అశోక్‌ తన్వర్‌కు ఇప్పుడు భాజపా టికెట్‌ ఇవ్వడం స్థానికంగా పలువురు స్వపక్ష నేతలకు నచ్చట్లేదు. మాజీ ముఖ్యమంత్రి భూపేందర్‌ హుడ్డా (కాంగ్రెస్‌) సొంత నియోజకవర్గం రోహ్‌తక్‌. జాట్‌ల ప్రాబల్యమున్న ఈ స్థానంలో ఆయన నాలుగుసార్లు గెలిచారు. ఇక్కడ మూడుసార్లు విజయం సాధించిన దీపేందర్‌ హుడ్డా.. గత ఎన్నికల్లో 7,503 ఓట్ల స్వల్ప తేడాతో అరవింద్‌ శర్మ చేతిలో ఓడిపోయారు. ఈసారి తిరిగి ఆ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు దీపేందర్‌ తీవ్రంగా కృషిచేస్తున్నారు. స్థానికంగా బలమైన నేత బీరేంద్రసింగ్‌ కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరడంతో 2019లో హిసార్‌ను కమలనాథులు గెల్చుకున్నారు. అక్కడ సిట్టింగ్‌ ఎంపీ బీరేంద్రసింగ్‌ కుమారుడు బ్రిజేంద్రసింగ్‌. తండ్రీకొడుకులిద్దరూ తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరడంతో ప్రస్తుతం హిసార్‌లో కాషాయదళానికి ఎదురుగాలి వీస్తోంది!

  • కర్ణాటకలోని చామరాజనగర్‌, కోలార్‌, చిక్కబళ్లాపుర స్థానాలను భాజపా ఈసారి నిలబెట్టుకుంటుందా అన్న ప్రశ్న ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
  • తెలంగాణలో ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లను అయిదేళ్ల కిందట తొలిసారి గెల్చుకున్న కమలదళం.. ఈసారి ఆదిలాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీ సోయం బాపురావుకు టికెట్‌ ఇవ్వలేదు. నిజామాబాద్‌లో సిట్టింగ్‌ ఎంపీ   ధర్మపురి అర్వింద్‌నే కొనసాగిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని