యువత, సీనియర్ల కలబోత.. బెంగాల్‌లో పట్టు సాధించేందుకు సీపీఎం ప్రయత్నం

పోరాడితే పోయేదేం లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. అనేది కార్మిక లోకంలో బాగా ప్రాచుర్యం పొందిన నానుడి. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం పరిస్థితి ఇలాగే ఉంది.

Updated : 16 Apr 2024 06:09 IST

సున్నా నుంచి మళ్లీ ఎదిగేందుకు పోరాటం

కోల్‌కతా: పోరాడితే పోయేదేం లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. అనేది కార్మిక లోకంలో బాగా ప్రాచుర్యం పొందిన నానుడి. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం పరిస్థితి ఇలాగే ఉంది. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో ఒక్కటీ ఆ పార్టీకి లేదు. దీంతో సున్నా నుంచి మొదలుపెట్టి మళ్లీ ఎదగాలని చూస్తోంది. ఇందులో భాగంగా యువతకు అధికంగా టికెట్లు ఇచ్చింది. యువతతోపాటు అనుభవానికీ ప్రాధాన్యమిచ్చింది. యువత, సీనియర్ల కలబోత తమకు మళ్లీ పూర్వ వైభవం సాధించిపెట్టనుందని ఆశలు పెట్టుకుంది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత యువతను ఆకట్టుకోవడంలో సీపీఎం విఫలమైందన్న విమర్శల నేపథ్యంలో వారికి అధిక ప్రాధాన్యమిచ్చింది.

  విద్యార్థి నేతలకు టికెట్లు

విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐకి చెందిన ముగ్గురు నేతలకు సీపీఎం టికెట్లిచ్చింది. జాదవ్‌పుర్‌ నుంచి శ్రీజన్‌ భట్టాచార్య, డైమండ్‌ హార్బర్‌ నుంచి ప్రతికుర్‌ రహమాన్‌, శ్రీరాంపుర్‌ నుంచి దీప్సితా ధర్‌ బరిలోకి దిగారు. మాజీ ఎంపీలు సుజన్‌ చక్రవర్తి, మహమ్మద్‌ సలీం, ఆలోకేశ్‌ దాస్‌లకు మాత్రం టికెట్లు ఇచ్చింది. మిగిలిన అందరూ కొత్త అభ్యర్థులే. అందునా యువ నేతలే. కమ్యూనిజం, దాని సంస్కృతి ఎల్లప్పుడూ పాత కొత్తల కలయికగా ఉంటుందని దమ్‌దమ్‌ నుంచి పోటీ చేస్తున్న పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుజన్‌ చక్రవర్తి తెలిపారు. యువ నాయకత్వాన్ని పార్టీ ప్రోత్సహిస్తుందని, జ్యోతిబసు హయాంలో సుభాశ్‌ చక్రవర్తి, అనిల్‌ బిశ్వాస్‌, శ్యామ్‌లాల్‌ చక్రవర్తిలాంటి యువ నేతలకు అవకాశం లభించిందని వివరించారు. గత కొన్ని ఎన్నికలుగా కొత్త ముఖాలను పరిచయం చేయడంద్వారా పార్టీ పూర్వ వైభవాన్ని పొందేందుకు ప్రయత్నిస్తోందని రాజకీయ విశ్లేషకుడు శుభోమయ్‌ మైత్రా తెలిపారు. కొత్త నేతలు తమ క్లీన్‌ ఇమేజ్‌ ద్వారా ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నారని వివరించారు.

కాంగ్రెస్‌తో పొత్తు

ఈ ఎన్నికల్లో సీపీఎం లెఫ్ట్‌లోని తన భాగస్వాములతోపాటు కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో కనీసం కొన్ని సీట్లయినా గెలుచుకోవాలనేది సీపీఎం ముందున్న తక్షణ లక్ష్యం. అదే సమయంలో సీనియర్లనూ కాపాడుకోవాలనేది ఆలోచనగా ఉంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్‌ సలీం ముర్షీదాబాద్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి కొన్ని సీట్లు గెలుస్తామని అనుకుంటున్నామని సలీం చెబుతున్నారు. 2019లో ఆ పార్టీకి ఒక్క సీటూ రాలేదు. భాజపా, తృణమూల్‌ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని సలీం తెలిపారు. భాజపా, తృణమూల్‌ ఓట్ల శాతం తగ్గుతోందని, అదే సమయంలో లెఫ్ట్‌, కాంగ్రెస్‌ల బలం పెరుగుతోందని వెల్లడించారు. పొత్తులో భాగంగా లెఫ్ట్‌ 30 సీట్లలో పోటీ చేస్తోంది. అందులో సీపీఎం 23 స్థానాల్లో బరిలోకి దిగింది.

2019లో 6.34 శాతం

గత లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎంకు 6.34శాతం ఓట్లు వచ్చాయి. తృణమూల్‌కు 43 శాతం, భాజపాకు 40శాతం ఓట్లు లభించాయి. డైమండ్‌ హార్బర్‌లో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీపై సీపీఎం తరఫున రహమాన్‌ పోటీ చేస్తున్నారు. అంత పెద్ద బాధ్యతలు అప్పగించడంపట్ల ఆయన పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. మమత హయాంలో పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు లేవని చెప్పారు. ఈ ఎన్నికల్లో లెఫ్ట్‌ పార్టీల ప్రధాన నినాదం ఉద్యోగ కల్పనే కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు