ఎమ్మెల్యే కూనంనేనిపై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసు

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై పాల్వంచ గ్రామీణ ఠాణాలో కేసు నమోదైంది. ఈ విషయం ఆలస్యంగా తెలిసింది.

Published : 17 Apr 2024 04:10 IST

పాల్వంచ గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై పాల్వంచ గ్రామీణ ఠాణాలో కేసు నమోదైంది. ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. ఎస్సై బి.శ్రీనివాస్‌ వివరాల ప్రకారం... గత నెల 23న పాల్వంచ మండలం జగన్నాథపురం, తోగ్గూడెం గ్రామాల్లో సీపీఐ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించారు. షామియానాలు వేసి జనాన్ని సమీకరించారు. ఎలాంటి అనుమతి తీసుకోకపోవడంతో ఇది ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనే అవుతుందని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేశ్‌ గత నెల 24న రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎన్నికల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రియాంక అలను విచారణకు ఆదేశించింది. ఆమె ఆదేశాలతో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌(ఎంసీసీ) జిల్లా నోడల్‌ అధికారి ప్రసూనరాణి ఎమ్మెల్యేకు ఇటీవల నోటీసు ఇచ్చారు. ఈ నెల 8న ఎమ్మెల్యే పంపిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో ఎంసీసీ మండల నోడల్‌ అధికారి, ఎంపీడీఓ విజయ్‌భాస్కర్‌ రెడ్డి అదే రోజు సాయంత్రం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కూనంనేనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని