2 నుంచి రెండంకెలకు చేరాలని..

ముస్లింలు, దళితుల పక్షాన గళమెత్తుతూ జాతీయ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్న ఎంఐఎం పార్టీ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో రెండంకెల సంఖ్యలో సీట్ల సాధనపై గురిపెట్టింది.

Updated : 17 Apr 2024 06:14 IST

యూపీ, మహారాష్ట్ర, బిహార్‌లలోనూ ఎంఐఎం పోటీ

ఈనాడు, హైదరాబాద్‌: ముస్లింలు, దళితుల పక్షాన గళమెత్తుతూ జాతీయ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్న ఎంఐఎం పార్టీ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో రెండంకెల సంఖ్యలో సీట్ల సాధనపై గురిపెట్టింది. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించింది. పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఇటీవల లఖ్‌నవూకు వెళ్లి అప్నాదళ్‌(కె) నేత పల్లవి పటేల్‌తో చర్చలు జరిపారు. పీడీఎం (వెనుకబడిన తరగతులు, దళితులు, మైనార్టీలు) ఫ్రంట్‌ పేరుతో లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ ఉమ్మడిగా పోటీ చేయాలని తీర్మానించారు. మరోవైపు- బిహార్‌లో ఒక స్థానంలో మజ్లిస్‌ తమ అభ్యర్థిని నిలబెట్టనుంది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలోనూ బరిలో దిగాలని గతంలో భావించినా.. ప్రస్తుతం పోటీకి దూరంగా ఉంటోంది. స్వయంగా పోటీ చేయని రాష్ట్రాల్లో.. భాజపాకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న పార్టీలకు మద్దతు ఇవ్వాలని అసదుద్దీన్‌ నిర్ణయించారు.

మహారాష్ట్రలో 5.. యూపీలో 8..

2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం మూడు స్థానాలకు పోటీ చేసిన మజ్లిస్‌ రెండు స్థానాల్లో గెలిచింది. హైదరాబాద్‌ నుంచి అసదుద్దీన్‌ ఒవైసీ, మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ నుంచి ఇంతియాజ్‌ జలీల్‌ ప్రస్తుతం పార్టీ తరఫున లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ దఫా ఎన్నికల్లో 15 స్థానాల్లో పోటీ చేసి, కనీసం 10 సీట్లలో గెలుపొందాలన్న లక్ష్యాన్ని పార్టీ నిర్దేశించుకుంది. యూపీలో 8, మహారాష్ట్రలో 5 నియోజకవర్గాల్లో ఎంఐఎం బరిలో దిగనుంది. అప్నాదళ్‌(కె)తో పొత్తు, ముస్లింల మద్దతు కలిసివస్తే యూపీలోనే 7 సీట్లలో విజయం సాధించవచ్చని మజ్లిస్‌ నాయకులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రలో ముస్లింలు, దళితులు ఎక్కువగా ఉన్న స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని అసదుద్దీన్‌ నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని