తొలిదశ పోలింగ్‌ 62.37%

దేశంలో 18వ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ఓటింగ్‌ శుక్రవారం పూర్తయింది.

Updated : 20 Apr 2024 05:53 IST

దేశవ్యాప్తంగా 102 లోక్‌సభ స్థానాల్లో ఓటింగ్‌ పూర్తి
మణిపుర్‌, బెంగాల్‌లో ఘర్షణలు
తూర్పు నాగాలాండ్‌లోని ఆరు జిల్లాల్లో ఎన్నికల బహిష్కరణ

దిల్లీ: దేశంలో 18వ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ఓటింగ్‌ శుక్రవారం పూర్తయింది. చెదురుమదురు ఘటనలను మినహాయిస్తే పోలింగ్‌ శాంతియుతంగా జరిగిందని ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది. దేశవ్యాప్తంగా 62.37% పోలింగ్‌ నమోదైనట్లు రాత్రి 9 గంటల సమయంలో వెల్లడించింది. అయితే తుది ఓటింగ్‌ శాతం శనివారం నిర్ధారణ అవుతుందని పేర్కొంది. తమిళనాడు, ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్‌, మిజోరం, పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌ దీవులు, లక్షద్వీప్‌లలో అన్ని లోక్‌సభ స్థానాలకు తొలి విడతలోనే పోలింగ్‌ పూర్తయింది. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ వినిపిస్తున్న తూర్పు నాగాలాండ్‌లోని ఆరు జిల్లాల్లో ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు. వాటిలో ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు. ఈ దఫా సార్వత్రిక ఎన్నికలు ఏడు విడతల్లో జరగనుండగా.. వాటిలో తొలి దశే అతిపెద్దది కావడం గమనార్హం. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల తొలి దశ (91 సీట్లు)లో 69.43% ఓటింగ్‌ నమోదైంది.

మండే ఎండను తట్టుకుంటూ..

ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ భారత సార్వత్రిక ఎన్నికలే. చాలా నియోజకవర్గాల్లో ఎండలు మండిపోతున్నా.. కొన్నిచోట్ల వర్షం కుండపోతగా కురుస్తున్నా.. ఓటర్లు ఓపికగా క్యూలైన్లలో వేచిచూసి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వివాహ తంతు పూర్తయిన వెంటనే నవ దంపతులు పెళ్లి దుస్తుల్లో నేరుగా పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటేయడం కొన్ని చోట్ల కనిపించింది. ముఖ్యంగా యువత ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్‌లోని ఉధమ్‌పుర్‌ నియోజకవర్గంలో పూర్తిగా మహిళా సిబ్బందితో ఏర్పాటుచేసిన ‘పింక్‌ బూత్‌’లకు ఓటర్ల నుంచి మంచి స్పందన కనిపించింది. సాధారణ పోలింగ్‌ కేంద్రాలతో పోలిస్తే వాటికి మహిళా ఓటర్లు ఎక్కువగా తరలివచ్చారు. తమిళనాడు, అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని పలు కేంద్రాల్లో ఈవీఎంలలో లోపాలు తలెత్తగా అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

మణిపుర్‌లో కాల్పుల కలకలం

జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో పోలింగ్‌ వేళ కొంత ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇన్నర్‌ మణిపుర్‌లోని థోంగ్జు అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానికులు, గుర్తుతెలియని వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ఆ స్థానం పరిధిలో పలుచోట్ల కాల్పుల ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మొయిరాంగ్‌ సీటు పరిధిలో థమ్నాపోక్పిలోని పోలింగ్‌ కేంద్రం వద్ద సాయుధులు గాల్లోకి కాల్పులు జరపడంతో ఓటర్లు భయంతో పరుగులు తీశారు. అక్కడ అధికారులు అదనపు భద్రతా సిబ్బందిని మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బిహార్‌ సీటు పరిధిలో భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌ వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇరు వర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తూర్పు కమెంగ్‌, కురుంగ్‌ కుమేయ్‌, అప్పర్‌ సుబాన్సిరి జిల్లాల్లో ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

అరుణాచల్‌ ప్రదేశ్‌ (60 నియోజకవర్గాలు), సిక్కిం (32)లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ కూడా శుక్రవారం పూర్తయింది. అరుణాచల్‌లో 69.44%, సిక్కింలో 70.39% పోలింగ్‌ నమోదైంది.


తమిళనాడులో ఉత్సాహంగా పోలింగ్‌

ఈనాడు-చెన్నై: తమిళనాడువ్యాప్తంగా 39 లోక్‌సభ స్థానాలకు, పుదుచ్చేరిలోని ఒక సీటుకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల్లో బారులుతీరారు. ప్రత్యేకించి మహిళలు, యువత ఓటేసేందుకు ఎక్కువగా వచ్చారు. కొన్నిచోట్ల ఓట్ల గల్లంతుపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. ప్రధానంగా గట్టి పోరున్న కోయంబత్తూరులో ఏకంగా లక్ష ఓట్లు గల్లంతైనట్లు భాజపా ఆరోపిస్తోంది. కొన్ని కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తోంది. తమ డిమాండ్లను ఆయా పార్టీలు పరిష్కరించలేదంటూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 గ్రామాల్లో ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారు. ఎండకు తట్టుకోలేక రాష్ట్రంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. సేలం జిల్లాలో ఇద్దరు, తిరువళ్లూరు జిల్లాలో ఒకరు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. వారు పోలింగ్‌ కేంద్రాల్లోనే కుప్పకూలిపోవడం విషాదాన్ని నింపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని